హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించాడు ప్రశాంత్ వర్మ. అతి తక్కువ బడ్జెట్ లో ఓ క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చి పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకొని, నిర్మాతల నమ్మకాన్ని గెలుచుకొన్నాడు. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ అంటే.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కిందే లెక్క. తన చేతిలో లెక్కలేనన్ని సినిమాలున్నాయి. నిర్మాతగానో, దర్శకుడిగానో ఎప్పుడూ ఏదో సినిమా ప్రకటిస్తూనే ఉంటాడు. ప్రశాంత్ వర్మ నుంచి దాదాపు 10 సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వచ్చాయి. అందులో ప్రభాస్, రిషబ్ శెట్టి లాంటి స్టార్ హీరోల ప్రాజెక్టులూ ఉన్నాయి. మరో ఐదారేళ్ల పాటు కొత్త సినిమా ఒప్పుకోలేనంతగా బిజీ అయిపోయాడు ప్రశాంత్ వర్మ.
కానీ ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. ప్రశాంత్ వర్మ `నా తదుపరి సినిమా మీకే` అనే షరతుమీద చాలా మంది నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకొన్నట్టు వినికిడి. దాదాపు 10 మంది నిర్మాతలు ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ లు ఇచ్చారు. నిరంజన్ రెడ్డి, సుధాకర్ చెరుకూరి, డి.వి.వి.దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్, హంబలే ఫిల్మ్స్.. ఇలా పేరున్న సంస్థలే ప్రశాంత్‌ని నమ్మాయి. కోరినంత అడ్వాన్సులు ఇచ్చాయి. కొత్త నిర్మాతల సంగతైతే లెక్కే లేదు. ఆ అడ్వాన్సులు అన్నీ కలుపుకొన్నా దాదాపు రూ 80 నుంచి రూ.100 కోట్ల వరకూ ఉంటాయి. కానీ ఇంత మందికి ఒకేసారి సినిమా ఎలా చేస్తాడు? ఎవరిదో ఒకరి సినిమా ముందుకెళ్తుంది. మిగిలిన నిర్మాతలు ఆగాల్సి వస్తుంది. దాంతో ప్రశాంత్ వర్మ మరో మార్గం ఎంచుకొన్నాడు. `నేను దర్శకత్వం చేయను కానీ, కథ ఇస్తాను. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాను` అంటూ నిర్మాతలకు ఆప్షన్లు ఇస్తున్నాడట. అవేం.. వాళ్లకు నచ్చడం లేదు. చేస్తే ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయాలి.. అంటూ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అడ్వాన్సులు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు.
అయితే ఆ వంద కోట్లూ.. తాను కొత్తగా నిర్మించిన స్టూడియోపై పెట్టుబడి పెట్టాడు వర్మ. హనుమాన్ సినిమా హిట్ అయిన వెంటనే హైదరాబాద్‌లో ఓ స్థలం కొని, అక్కడ ఖరీదైన ఆఫీస్ నిర్మించాడు వర్మ. తాను సంపాదించింది, అడ్వాన్సుల రూసంలో వచ్చిన డబ్బు మొత్తం ఆ స్టూడియోపైనే పెట్టేశాడు. ఇప్పుడు అందరికీ డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరని పని. కానీ నిర్మాతలెవరూ రాజీకి రావడం లేదు. వాళ్లంతా ఇప్పుడు ప్రశాంత్ వర్మపై ఛాంబర్ లో ఫిర్మాదు చేయాలని నిర్ణయించుకొన్నట్టు టాక్. ఈ పంచాయితీ ఎప్పటి తేలుతుందో తెలియదు. ఈలోగా ప్రశాంత్ వర్మ చేయాల్సిన సినిమాలు కూడా గందరగోళంలో పడతాయి. ఈ ఉపద్రవం నుంచి ఈ యువ దర్శకుడు ఎలా బయటపడతాడో చూడాలి.
