బలగం, మల్లేశం లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. జాతిరత్నాలు, ఓం భీమ్ బుష్ లాంటి మల్టీ-స్టారర్ సినిమాలు కూడా అలరించాయి. కానీ తను సోలో హీరోగా చేసిన సినిమాలు ఆశించిన విజయాలు రాబట్టుకోలేదు. డార్లింగ్, మిత్రమండలి, సారంగపాణి జాతకం.. చిత్రాలు బాక్సాఫీస్ ముందు నిరాశపరిచాయి. అయితే ఈ సినిమాలన్నీ నిర్మాతను ఇబ్బంది పెట్టలేదని చెబుతున్నాడు ప్రియదర్శి.
“డార్లింగ్, మిత్రమండలి, సారంగపాణి జాతకం సరిగ్గా ఆడలేదు. డార్లింగ్ ఓటీటీలో బాగా ఆడింది. మిత్రమండలి సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాం. కానీ సినిమా థియేటర్ రిజల్ట్ సరిగ్గా రాలేదు. ఓటీటీలో కాంతరతో పోటీపడి మరీ రెండో స్థానంలో నిలిచింది. సారంగపాణి జాతకం మంచి సినిమా. కాకపోతే ఆ సినిమా కూడా థియేటర్లలో సరిగ్గా రాణించలేదు. అయితే ఈ సినిమాలు ఏవీ కూడా నిర్మాతకు నష్టం మిగల్చలేదు. ఇప్పటివరకు నేను హీరోగా చేసిన ఏ సినిమా కూడా నష్టాలు తీసుకురాలేదు. నేను కాస్ట్ ఫెయిల్యూర్ హీరోని కాదు” అని చెప్పుకొచ్చాడు దర్శి.
దర్శి ప్రధాన పాత్రలో నటించిన ప్రేమంటే 21న విడుదల కానుంది. ఈ సినిమా తప్పక తనకు మంచి విజయాన్ని అందిస్తుందని, ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చే సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
