డిసెంబరు 5న రావాల్సిన అఖండ 2 వాయిదా పడింది. కనీసం శుక్రవారం రాత్రి నుంచైనా అఖండ 2 తాండవం చూడొచ్చు అనుకొన్నారు. నిర్మాతలు కూడా అందుకోసం శతవిధాలా ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు. దాంతో అఖండ 2 మరో డేట్ కోసం చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎట్టిపరిస్థితుల్లోనూ అఖండ 2 ఈనెలలోనే విడుదల కావాల్సివుంది. సంక్రాంతికి స్లాట్ దొరికే పరిస్థితి లేదు. అందుకే డిసెంబరులో రావడం మినహా మరో మార్గం లేదు. ఇందుకోసం అఖండ 2కి ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. డిసెంబరు 12, డిసెంబరు 19, డిసెంబరు 25.. ఇవి మూడూ.. అఖండ ముందున్న డేట్లు.
డిసెంబరు 12న.. చిన్న, మీడియం సినిమాలు జోరుగా రాబోతున్నాయి. అఖండ వస్తే, ఆ సినిమాలు డిస్ట్రబ్ అవుతాయి. పైగా ప్రచారానికి కూడా పెద్దగా సమయం దొరకదు. డిసెంబరు 19న అవతార్ 3 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 3 ప్రభావం పెద్దగా లేకపోవొచ్చు కానీ, మిగిలిన చోట అవతార్ 3 ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో థియేటర్లు దొరకడం కష్టం అయిపోతుంది.
ఇక మిగిలిన బెస్ట్ ఆప్షన్ డిసెంబరు 25. క్రిస్మస్ సెలవలు అఖండ 2కి బాగా కలిసొస్తాయి. సంక్రాంతి వరకూ అఖండ 2కి తిరుగులేకపోవొచ్చు. పైగా ప్రమోషన్లకు కావల్సినంత సమయం ఉంటుంది. కాకపోతే నెలాఖరు వల్ల ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు. అది మినహా అఖండ 2 విడుదలకు పెద్దగా ఇబ్బందులు లేవు. ఈలోగా ఫైనాన్షియర్లలో, డిస్టిబ్యూటర్లతో ఏమైనా సమస్యలు ఉంటే చక్కబెట్టొచ్చు. అందుకే చిత్రబృందం కూడా క్రిస్మస్ వైపు దృష్టి సారించిందని సమాచారం. డిసెంబరు 24న ప్రీమియర్లు ప్రదర్శించి, 25న చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
