తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసు రక్షణ మధ్య తాడిపత్రికి చేరుకున్నారు. భద్రతకు అయ్యే ఖర్చు తానే పెట్టుకుంటానని సుప్రీంకోర్టుకు ఆయన హామీ ఇవ్వడంతో.. మూడు వందల పోలీసుల భద్రతు అయ్యే ఖర్చు పెట్టుకుని తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు.. ఎన్నికలకు ముందు పెద్దారెడ్డి , ఆయన అనచరులు చేసిన దాడులు, దౌర్జన్యాలతో ఓడిపోయిన తరవాత ఆయన తాడిపత్రిలోకి అడుగు పెట్టలేకపోయారు. ఓ సారి ఎవరికీ తెలియకుండా తాడిపత్రికి వచ్చారు. కానీ వెంటనే పోలీసులు మళ్లీ బయటకు తీసుకెళ్లిపోయారు.
హైకోర్టులోనూ తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి లభించకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అని పోలీసులు చెప్పాం. అయితే భద్రతా ఖర్చు తానే పెట్టుకుంటానని పెద్దారెడ్డి చెప్పారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వబోనని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు. ఆయనను మహిళలే అడ్డుకుంటారని ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వస్తున్నందున.. ఉద్రిక్తతలు సృష్టించవద్దని.. ఆయన తాడిపత్రిలో రాజకీయ పరమైన ప్రకటనలు, రెచ్చగొట్టే ప్రకటనలు ఏమీ చేయకుండా చూసేలా పెద్దారెడ్డి అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
పెద్దారెడ్డి తాడిపత్రిలో రాజకీయాలు చేయాలనుకుంటే.. ఆయన నియోజకవర్గంలో తిరగాల్సి ఉంటుంది. కానీ అక్కడ అడుగు పెట్టడానికే ఆయన చాలా శ్రమపడాల్సి వచ్చింది. అందుకే నియోజకవర్గ ఇంచార్జ్ గా ఆయన స్థానంలో మరొకర్ని పెట్టేందుకు వైఎస్ జగన్ ఆలోచిస్తున్నరాన్న ప్రచారం జరుగుతోంది. ఈ లోపు ఆయనకు తాడిపత్రి ఎంట్రీ అవకాశం లభించింది. సాయంత్రం లోపు పరిణమాలు ఎలా ఉంటాయన్నది తాడిపత్రిలో ఉత్కంఠగా మారింది.
