తెలంగాణ నేతలపై పవన్ కల్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలను మొదట బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేశాయి. ఎందుకలా చేశాయన్నదానిపై వారికి దీర్ఘకాలిక రాజకీయం వ్యూహం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ తమ కాళ్లకు అడ్డం పడకుండా.. ముందు జాగ్రత్తగా ఈ రెండు పార్టీలు ఈ టాపిక్ ను సెంటిమెంట్ గా మార్చి ఆయుధంగా రెడీ చేసుకుని పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
గ్రేటర్ లో జనసేన పార్టీకి కొంత బలం
తెలంగాణలో జనసేన పార్టీకి పెద్దగా బలం ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. కొంత క్యాడర్ ఉంది. చురుకుగా ఉన్నా లేకపోయినా కొంత మంది నేతలు పార్టీ కోసం పని చేస్తున్నారు. అందుకే గత ఎన్నికల్లో బీజేపీ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి బహిరంగ మద్దతు ప్రకటించింది. పవన్ ప్రచారానికి రాలేదు కానీ భవిష్యత్ ఎన్నికల్లో రారు అని చెప్పడానికి అవకాశం లేదు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పాత్ర క్రియాశీలకంగా ఉండనుంది. గ్రేటర్ లో జనసేన పార్టీకి కొంత బలం ఉంటుంది. ఆంధ్ర ఓటర్లు, సామాజికవర్గం ఓటర్లు ఇలా.. ఫలితాలు మార్చడానికి అవసరమన ఓటర్ల మద్దతు కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది అందుకే గత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ .. జనసేన మద్దతు తీసుకుంది. జనసేన పోటీ నుంచి విరమించుకుంది.
ఈ సారి కూడా జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే చాన్స్
టీడీపీ ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో లేదు. ఎప్పటికి మళ్లీ యాక్టివ్ అవుతుందో కూడా ఎవరికీ తెలియదు.కానీ జనసేన పార్టీ మాత్రం యాక్టివ్ గానే ఉంది. ఆ పార్టీని నమ్ముకున్న వారికి పవన్ కల్యాణ్ ఏదో విధంగా రాజకీయ భవిష్యత్ కల్పించాలని అనుకుంటున్నారు. అందుకే ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా కొంత మందికి అయినా చాన్స్ ఇప్పించాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలతో ఆయన పవర్ ను.. రాజకీయ ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నించాయి. కాంగ్రెస్ కు గ్రేటర్ ఎన్నికలు చాలా కీలకం. అన్ని లెక్కలేసుకుని ఈ అంశంపై ఆలస్యంగా స్పందించి సెంటిమెంట్ రాజేశారు. ఆ ఆయుధాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
పవన్ ఎప్పుడు రాజకీయం చేసినా తెరపైకి దిష్టి వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ ఇక ముందు తన జనసేన పార్టీతో తెలంగాణలో ఎప్పుడు రాజకీయం చేయాలనుకున్నా.. దిష్టి వ్యాఖ్యలు తెరపైకి వస్తాయనడంలో సందేహం లేదు. తెలంగాణను అవమానించిన వారికి తెలంగాణ గడ్డపై చోటు లేదని.. క్షమాపణలు చెప్పాలని ఆ తర్వాతే రాజకీయాలు చేయాలని డిమాండ్ చేస్తారు. అందుకే.. పవన్ కల్యాణ్‌కు ఇక ముందు తెలంగాణ రాజకీయాల్లో కాస్త క్లిష్టమైన పరిస్థితే ఎదురు కానుందని అనుకోవచ్చు.
