పరకామణి చోరీ కేసు రానున్న రోజుల్లో ఎవరూ ఊహించనంత సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరోసారి ఈ అంశంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. అయితే ఒకే అంశంలో రెండో సారి కేసు నమోదు చేయడం సాధ్యం కాదు. కానీ ఆ ఒక్క దొంగతనంపై కాదు.. ఇంకా చాలా దోపిడీలు జరిగాయని ఆధారాలు సేకరించింది. ఆ ఆధారాలతో మరో కేసు క్రిమినల్ కేసు నమోదు చేసి.. దేవుడ్ని దోచుకున్న వైనాన్ని ప్రజల ముందు.. చట్టం ముందు పెట్టేందుకు రెడీ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
రవికుమార్ దొంగతనాలు ఊహించనంత భారీగా?
పెదజీయర్ మఠం ఉద్యోగి అయిన రవికుమార్ శ్రీవారి హుండీలో భక్తులు వేసిన డాలర్లను దొంగతనం చేస్తూ దొరికిపోయారు. ఆయన దొంగతనం చేసింది 900 డాలర్లు మాత్రమే. కానీ తర్వాత కేసు రాజీ కోసం దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చారు. అంతకు మించి మరో వంద కోట్ల వరకూ విలువైన ఆస్తులు అప్పటి టీటీడీ అధికారులు, వైసీపీ నేతల బీనామీల పేర్ల మీదకు మారిపోయాయి. ఓ సాధారణ ఉద్యోగి.. అలా ఎంత కాలం .. ఎన్ని వేల డాలర్లు తీసుకెళ్లినా వందల కోట్లు ఎలా కూడబెట్టగలరు?. అనే ప్రస్న సహజంగానే ఎవరికైనా వస్తుంది. అంటే.. ఎవరూ ఊహించని విధంగా ఆయన దొంగతనాలు చేశారు.అందులో డాలర్లే ఉన్నాయా.. ఇంకా విలువైన వస్తువులు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది.
రవికుమార్ దోపిడీ వెనుక పెద్దలు?
ఓ సాధారణ ఉద్యోగి.. ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి సహకారం లేకుండా ఒక్క కాయిన్ కూడా పరకామణి నుంచి బయటకు తీసుకెళ్లలేరు. రవికుమార్ కు పెద్ద ఎత్తున ఇతరులు సాయం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎంత కాలం నుంచి ఈ దోపిడీ సాగుతోంది.. ఎవరు సహకరించారు.. ఎందుకు ఇంత కాలం కనిపెట్టలేకపోయారన్నది పెద్ద మిస్టరీ. అవన్నీ తేలాలంటే.. కొత్తగా కేసు నమోదు కావాల్సిందేనని టీటీడీ పెద్దలు నిర్ణయించారు. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రవికుమార్ చోరీ కేసుతో సంబంధం లేకుండా ఇతర దొంగతనాలపై విచారణ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆస్తులు రాయించుకున్న వారెవరో బయటకు వస్తే మొత్తం క్లారిటీ
రవికుమార్ కు చెందిన ఆస్తులు ఎవరి పేర్ల మీదకు మారిపోయాయో.. తమిళనాడు ప్రభుత్వం నుంచి సమాచారం వస్తే మొత్తం కేసు వీడిపోతుంది. ఎందుకంటే రవికుమార్ అక్రమాస్తులన్నీ అక్కడే ఉన్నాయి. రాజీ చేసుకోవాలని చనిపోయిన సతీష్ పై ఒత్తిడి చేసిందెవరు.. రవికుమార్ ఆస్తుల్ని దోచిందెవరో క్లారిటీ వస్తే.. ఆ ఆస్తులన్నీ రవికుమార్ ఎలా సంపాదించాడో బయటకు వస్తుంది. అలా సంపాదించడానికి సహకిరంచిన వారి పేర్లు కూడా బయటకు వస్తాయి. ఈ కేసును అటు న్యాయస్థానాలు.. ఇటు టీటీడీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. దేవుడ్ని దోచిన వాళ్లను వదిలిపెట్టే అవకాశం ఉండదు. అందుకే.. అసలైన దొంగల నుంచి త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే తెరవెనుక కుట్రదారులు చాలా కుట్రలు చేస్తున్నారు. రవికుమార్ తో కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారు. సాక్షుల్ని కీలక వ్యక్తుల్ని ఎలిమినేట్ చేస్తున్నారు. అందుకే ఈ కేసు లోతు ఎవరికీ అర్థం కావడం లేదు.
