సీరియస్ నెస్ లేని రాజకీయాలు చేస్తూ..గాలి గాసిప్స్‌తో టైం పాస్ చేస్తున్నారు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు. ఒకరిపై ఒకరు పుకార్లను పట్టించుకుని వారి సొంత ఇంట్లో కుంపటి పెట్టేయగలమని అనుకుంటున్నారు. కానీ రాజకీయాలు మరీ వారనుకున్నంత సింపుల్ గా ఉండవని అర్థం చేసుకోలేకపోతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి .. కాంగ్రెస్ ఎంపీలతో రేవంత్ బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఓటేశారని ఆరోపించారు. తనకు ముగ్గురు ఎంపీలు స్వయంగా చెప్పారని కూడా కౌశిక్ రెడ్డి చెప్పుకున్నారు. ఇలాంటి ఆరోపణలు చేసి.. రేవంత్ పై కాంగ్రెస్ హైకమాండ్ లో అపనమ్మకం తీసుకు వచ్చేస్తామని కౌశిక్ రెడ్డి అనుకున్నట్లుగా ఉన్నారు. కానీ ఇవన్నీ చిన్నపిల్లాడు చేసిన ఆరోపణల్లా ఉన్నాయి కానీ.. ఎవరైనా నమ్ముతారా
కౌశిక్ రెడ్డి ఆరోపణలకు ఏ మాత్రం తీసిపోలేదు.. కాంగ్రెస్ నేతలు. సామ రామ్మోహన్ రెడ్డి.. కేటీఆర్ ను.. బెంగళూరు నార్కోటిక్ పోలీసులకు పట్టించేలా హరీష్ రావు ప్లాన్ చేశారని చెప్పేశారు. డ్రగ్స్ కేసులో కేటీఆర్ ను జైలుకు పంపి..పార్టీని హస్తగతం చేసుకునేందుకు హరీష్ ప్రయత్నిస్తున్నారని సామ చెప్పుకొచ్చారు. ఎందుకైనా మంచిదని ఆయన తెలంగాణ పోలీసుల్ని ఇన్వాల్వ్ చేయకుండా బెంగళూరు పోలీసులు అనేశారు.
ఇలాంటి ఆరోపణలు గాలి గాసిప్స్ కేటగిరి కిందకు వస్తాయి. ఎవరూ నమ్మకపోగా.. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారు ఈ సారి సీరియస్ కామెంట్స్ చేసినా నమ్మరు. అయినా ఇదో తరహా రాజకీయం అంతే.
