‘పుష్ప 2’ విడుదలై నేటికి సరిగ్గా ఏడాది. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా మైలురాయి. దాదాపుగా రూ. 1,740 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీసు ని రూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేశాయి. అయితే ఇంతపెద్ద విజయాన్ని బన్నీ మనసారా ఆస్వాదించలేకపోయారు. ఈ విజయం ఆయన జీవితంలో ఒక పీడకలగా నిలిచింది. దురదృష్టవశాత్తూ జరిగిన ఓ ఘటన కారణంగా నిండిప్రాణం పోయింది. పుష్ప-2 బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ కి వెళ్లారు అల్లు అర్జున్. ఆయన్ని చూడానికి జనాలు పెద్ద ఎత్తున ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటన లో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఓ హైవోల్టేజ్ డ్రామాని తలపించింది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్, తెలంగాణ ముఖ్యమంత్రి పేరునే మర్చిపోవడం మరో రభసకు దారితీసింది. దీన్ని బిఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ మైలేజ్ కోసం వాడుకున్నారు. పదేపదే అల్లు అర్జున్ మాటలని ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ విషయంలో బన్నీ మౌనం మరింత డ్యామేజీ చేసింది. బన్నీ అరెస్ట్ ని రాజకీయ లబ్ది కోసం వాడేసాయి ప్రతిపక్ష పార్టీలు. తన పేరు మర్చిపోయినందుకు రేవంత్ రెడ్డి కక్ష తో అరెస్ట్ చేయించారని వితండవాదం చేశారు బీఆర్ఎస్ నాయకులు. అలాగే అల్లు అర్జున్ ని పరామర్శించడానికి తెలుగు సినీ పరిశ్రమ ఆయన ఇంటికి క్యూ కట్టింది.
దీంతో రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఘటనని సామాన్యులందరికీ అర్ధమయ్యేలా చెప్పారు.‘టికెట్ రేట్లు పెంచమంటే పెంచాము. ఒక ప్రాణం పోయింది వూరుకోమంటే.. సహించాలా? చనిపోయిన కుటుంబాన్ని సినీ పెద్ద పరామర్శించారా? అంటూ నిలదీశారు. సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం పై అల్లు అర్జున్ వెంటనే ఓ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది బన్నీ తొందరపాటు చర్యగా మారింది. ప్రెస్ మీట్ పెట్టి ఇష్యూని ఇంకా పెద్దది చేసుకున్నారు. బన్నీ మాటలు కొన్ని అనవసరమైన వివాదాన్ని రేపాయి. ఆయన ఇంటిపై రాళ్ళదాడి కూడా జరిగింది.
అల్లు అర్జున్ వివాదాన్ని కారణంగా చూపుతూ సినీ పరిశ్రమకు రేవంత్ సర్కార్ వ్యతిరేకమనే ప్రచారం జరిపారు ప్రత్యర్ధులు. ఐతే ఈ మొత్తం విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి, సినీ పెద్దల సమవేశం జరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మొత్తం వివాదంపై సంద్ఫించిన తీరు ఇటు పరిశ్రమ అటు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య సహృద్భావ వాతావరణాన్ని నెలకొనేలా చేసింది. ఈ మొత్తం ఇష్యూలో రేవంత్ రెడ్డి సర్కార్ పని తీరుని మెచ్చుకున్న పవన్ అదే సందర్భంలో కేవలం బన్నీని ఒంటరి చేసినట్లుగా అనిపించిందని అన్నారు. ఏదేమైనా రేవతి కుటుంబానికి వెంటనే క్షమాపణ చెప్పాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ సర్కార్ కూడా ఈ మొత్తం ఘటనపై ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళింది. కళాకారులపై తమకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని చాటి చెప్పింది. అల్లు అర్జున్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో ఆయన నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డుతో సత్కరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అల్లు అర్జున్ ని పెట్టుకొని రాజకీయం చేయాలని చూసిన ప్రతిపక్షాలకు ఇది షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. భాస్కర్ కుటుంబం భవిష్యత్తు కోసం 2 కోట్లు డిపాజిట్ చేశారు అల్లు అర్జున్. దానిపై వచ్చే వడ్డీ ద్వారా నెలకు రూ.75,000 కుటుంబ ఖర్చులకు, శ్రీతేజ్ వైద్య బిల్లులకు ఉపయోగిస్తున్నారు. అలాగే 75 లక్షలు ఆస్పత్రి ఖర్చుల కోసం చెల్లించారు. ఇంకా అదనపు సాయం చేయడానికి కూడా రెడీగా ఉన్నారు.
ఏదేమైనా పుష్ప 2 సినిమా జీవితానికి సరిపడా విజయాన్ని, అలాగే ఒక్క నిమిషంలో జీవితం తలకిందులైపొతుందనే జీవితం సత్యాన్ని బన్నీకి నేర్పించింది. ఈ ఒక్క సినిమాతో జీవితానికి సరిపడా అనుభావాలు చూశాడు. బన్నీ జీవితంలో బిగ్గెస్ట్ సక్సెస్, బిగ్గెస్ట్ రిగ్రేట్ పుష్ప 2నే కావడం విధి లిఖితం అనుకోవాలి.
