హైదరాబాద్ మెట్రో అంటే గుర్తుకు వచ్చే మొదటి అధికారి ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో కోసం మొదటి సారిగా ఓ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినప్పుడు 2007లో ఆయన ఎండీగా నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఆయన ఎండీగానే కొనసాగారు. దాదాపుగా తొమ్మిదేళ్ల క్రితమే రిటైరనా..ఆయనకు కంటిన్యూషన్ లభిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మెట్రో విస్తరణను సీరియస్ గా తీసుకున్న సమయంలో ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. పూర్తి స్థాయి ఎండీని కూడా నియమించకుండా… సర్ఫరాజ్ అహ్మద్ కు అదనపు బాధ్యతలు ఇచ్చింది.
ఎన్వీఎస్ రెడ్డి లేకపోతే మెట్రో ఎలా అన్నట్లుగా ఆయన కీలకం అయ్యారు. మెట్రో శంకుస్థాపన నుంచి ఇప్పటి వరకూ ఆయన ముద్ర కీలకం. కానీ ఇటీవలి కాలంలో మెట్రో విస్తరణకు సంబంధించిన పనులు ముందుకు సాగకపోతూండటంతో ఆయనపై ప్రభుత్వం అసహనానికి గురైనట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎల్ అండ్ టీ నిర్వహణ భారం నుంచి తప్పించాలని కోరుకుంటోంది. కేంద్రానికి కూడా లేఖ రాసింది. మెట్రో ఎండీకి తెలియకుండా ఎల్ అండ్ టీ ఇలా లేఖ రాయదని ప్రభుత్వం భావించినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో ఎన్వీఎస్ రెడ్డి కాలానికి అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ప్రభుత్వ పెద్దలు భావించారు. అయితే ఆయనను నొప్పిపంచకుండా.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సలహాదారుగా నియమించి.. మెట్రో ఎండీగా తప్పించారు. ఎన్వీఎస్ రెడ్డి ని వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు నియమించారు. తర్వాత కేసీఆర్ ఆయనను కదిలించలేదు. పైగా రిటైర్ అయినా ఎక్స్ టెన్షన్ ఇచ్చారు. రేవంత్ సీఎం అయ్యాక.. పొడిగింపులో ఉన్న రిటైర్డ్ అయిన అధికారులందర్నీ తొలగించారు. కానీ ఎన్వీఎస్ రెడ్డికి మాత్రం ప్రత్యేక ఉత్తర్వులతో పొడిగింపునిచ్చారు. ఇప్పుడు మాత్రం..బదిలీ చేయక తప్పలేదు.
