ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP-RERA) చైర్మన్‌గా శివారెడ్డిని ప్రభుత్వం నియమించింది. రియల్ ఎస్టేట్ రంగం క్రమబద్ధంగా ఉండటానికి, కొనుగోలుదారులు మోసపోకుండా ఉండటానికి రెరా చాలా ముఖ్యం. అందుకే ప్రభుత్వం శివారెడ్డిని ఎంపిక చేసింది. శివారెడ్డి ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణుడు మాత్రమే కాదు.. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అమరావతి జేఏసీ నాయకుడిగా ముందుండి ఉద్యమం నడిపించారు. ఈ నియామకం రంగంలో పారదర్శకత , వినియోగదారుల హక్కుల రక్షణకు మరింత బలం చేకూర్చనుందని అంచనా వేస్తున్నారు.
గతంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (CREDAI) ఆంధ్రప్రదేశ్ ఛాప్టర్ ప్రెసిడెంట్‌గా కూడా శివారెడ్డి పనిచేశారు. 2020లో తన పదవిని వదిలి అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతుల ఉద్యమానికి నాయకత్వం వహించారు. అమరావతి JACలో ప్రముఖ వ్యక్తిగా, రాజధాని ఉద్యమానికి అంకితమయ్యారు.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే ఈ స్టాట్యూటరీ అథారిటీని బలోపేతం చేయడానికి చైర్మన్‌ను నియమించారు. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో, AP-RERAని మరింత బలపరచడం ద్వారా వినియోగదారుల హక్కులను రక్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పు, అమరావతి రాజధాని ప్రాజెక్టులతో పాటు విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో జరుగుతున్న రియల్ ఎస్టేట్ బూమ్‌కు సంబంధించిన వివాదాల వేగవంతమైన పరిష్కారం అందించడానికి సహాయపడుతుంది.
ఏ డెవలపర్పైన అయినా ఫిర్యాదు చేయడానికి సామాన్య పౌరుడు AP-RERAకు సంప్రదించవచ్చని శివారెడ్డి భరోసా ఇస్తున్నారు. RERA చట్టం ప్రకారం, డెవలపర్లు ప్రాజెక్ట్ ప్లాన్లు, లేఅవుట్లు, ప్రభుత్వ అనుమతులు, భూమి టైటిల్ స్థితి, సబ్-కాంట్రాక్టర్ల వివరాలు, పూర్తి తేదీలు వంటి అన్ని సమాచారాన్ని AP-RERAలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. RERA అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆర్డర్లను ఉల్లంఘించిన డెవలపర్‌కు గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లేదా లేకుండా జరిమానా విధించవచ్చు. ప్రాజెక్ట్ పూర్తి ఆలస్యం వల్ల డెవలపర్, వినియోగదారు బ్యాంక్‌కు చెల్లించే EMIకి సమానమైన వడ్డీని వినియోగదారుడికి చెల్లించాల్సి ఉంటుంది. విక్రయించిన ప్లాన్‌లో మార్పులు చేయాలంటే కొనుగోలుదారుడి రాతపూర్వక అనుమతి తప్పనిసరి.
