కాలంతో మారని పట్టల వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు. కార్మిక చట్టాలు కూడా అలాంటివే. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఉన్న చట్టాలే ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉపాధి అనే పదానికి అర్థం మారిపోయింది. ఉద్యోగం అనే పదానికి అర్థం మారిపోయింది. విభిన్న రంగాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి. వాటిలో పని చేసేవారి సంక్షేమం చట్టపరంగా చూడాల్సి ఉంది. అందుకే కేంద్రం కొత్త లేబర్ కోడ్స్ తీసుకు వచ్చింది.
శుక్రవారం నుంచి కొత్త లేబర్ కోడ్స్
శుక్రవారం నుంచి భారత్ లో నుంచి నాలుగు కొత్త లేబర్ కోడ్లను అమలు ప్రారంభమయ్యాయి. 29 పాత కేంద్ర కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటిని ఏకీకృత, ఆధునిక ఫ్రేమ్‌వర్క్‌గా మార్చాయి. వీటి ద్వారా కార్మికులు, శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్, గిగ్ వర్కర్స్, మైగ్రెంట్ వర్కర్స్ వరకు భద్రత, సామాజిక హక్కులు, ఆర్థిక ప్రయోజనాలు మరింత బలపడతాయి. కోడ్లు కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఉద్యోగులకు సమాన అవకాశాలు, భద్రతను అందించడానికి రూపొందించారు.
కార్మికుల సంక్షేమమే ప్రధానం
కోడ్ ఆన్ వేజెస్ , ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ , కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ ఉంటాయి. వీటిలో అన్ని వర్గాల ఉద్యోగుల సంక్షేమం ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, గిగ్ వర్కర్లకూ భద్రత లభిస్తోంది. 2030 నాటికి 23.5 మిలియన్ల గిగ్ వర్కర్స్కు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా. దేశవ్యాప్తంగా ఏకీకృత మినిమమ్ వేతనం, టైమ్లీ పేమెంట్ తప్పనిసరి. సమాన పనికి సమాన వేతనం కూడా ఇందులో భాగమే. మొత్తం వేతనంలో 50% ‘వేజ్’గా పరిగణించి, PF, గ్రాచ్యుటీ, మెటర్నిటీ బెనిఫిట్స్ పెరుగుతాయి.
పక్కాగా అమలు చేయడం ముఖ్యం
కార్మిక చట్టాలు ఉన్నా ఇప్పటి వరకూ వాటిని సరిగ్గా కార్మికుల హక్కుల కాపాడటానికి ఉపయోగించిన సందర్భాలు తక్కువే. ఏ ప్రైవేటు సంస్థా వాటిని పాటించదు. నీతులు చెప్పే మీడియాలోనే పాటించరు. కానీ వాటిని అమలు చేయాలని ఎవరైనా లేబర్ కోర్టుకు వెళ్తే వారి జీవితం అక్కడే గడిచిపోతుంది. మరో ఉద్యోగం చేసుకోవడం కష్టం. యాజమాన్యాల దయ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త చట్టాలు అయినా పక్కాగా అమలు అయితేనే ప్రయోజనం ఉంటుంది.
