బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి నారా లోకేష్ వెళ్తున్నారు. ఎన్డీఏ పార్టీలకు చెందిన నేతలు బీహార్ లో ప్రచారం చేస్తున్నారు. అయితే దక్షిణాది నేతలు మాత్రం పెద్దగా పాలు పంచుకోవడం లేదు. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న దశలో ఏపీ నుంచి నారా లోకేష్‌తో ప్రచారం చేయించాలని ఎన్డీఏ కూటమి పెద్దలు నిర్ణయించారు. ఆ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుంది. అందుకే శనివారం రెండు సమావేశాలు, ఆదివారం ఉదయం పట్నాలో వ్యాపారవేత్తలతో లోకేష్ సమావేశాల్లో పాల్గొంటారు.
నారా లోకేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడిగా ఎదుగుతున్నారు. ఢిల్లీ వర్గాల్లో ఆయనకు మంచి పేరు వచ్చింది. బీహార్ లోనూ గూగుల్ డేటా సెంటర్ తో పాటు ఇతర అంశాలతో పాలకుడిగా మంచి పేరు వచ్చింది. చదువుకున్న యువత నారా లోకేష్ పనితీరును అభిమానిస్తారని ఆయనను ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది. లోకేష్ ఇలా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో తమిళనాడులోనూ బీజేపీ కూటమి తరపున ప్రచారం చేశారు.
గతంలో నారా లోకేష్ ను చంద్రబాబునాయుడు కుమారుడిగానే గుర్తించేవారు. కానీ తర్వాత తనదైన ముద్ర వేస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, తన రాజకీయ విధానాలు, ప్రధాని మోదీతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన నేషనల్ టాపిక్ అవుతున్నారు.
