80వ దశకంలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నందమూరి కల్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇచ్చారు. రోషన్ హీరోగా నటిస్తున్న ‘ఛాంపియన్’ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో రాజి రెడ్డి పాత్రలో కనిపిస్తారు. ఫస్ట్ లుక్ ఆయన వయసుకు తగ్గట్టుగా హుందాగా వుంది. స్వప్న సినిమాస్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఆయన్ని ఓ పాత్ర కోసం సంప్రదించారు. అయితే అప్పట్లో ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఛాంపియన్ కథ, పాత్ర నచ్చి మళ్ళీ మేకప్ వేసుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు స్వయానా తమ్ముడు త్రివిక్రమరావు కుమారుడు కళ్యాణ్. 1980లలో తెలుగు చిత్రసీమలో కథానాయకునిగా కొన్ని చిత్రాలలో నటించాడు. అయితే హీరోగా పెద్ద బ్రేక్ రాలేదు. కొన్ని సినిమాలలో సహాయ నటునిగా కూడా నటించాడు. తండ్రి అనారోగ్యం పాలవ్వడంతో దగ్గరుండి చూసుకొనేందుకు సినిమాలని విడిచిపెట్టారని తెలిసినవారు చెబుతారు. ఇప్పుడు ఛాంపియన్ తో ఎంట్రీకి రెడీ అయ్యారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25 రానుంది.
