మురుగదాస్ ఫామ్‌లో లేడు. ఆయన చేసిన సినిమాలు వరుసగా పల్టీలు కొడుతున్నాయి. ఒకప్పుడు హీరోయిజంతో మంచి కమర్షియల్ సక్సెస్‌లు తీసిన మురుగ… ఇప్పుడు యావరేజ్ సినిమాలు కూడా అందించలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో డీసెంట్ విజయాలతో కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటున్న శివకార్తికేయన్‌తో ‘మదరాసి’ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా తన జాతకం మారలేదు. ఈ వారం వచ్చిన సినిమా నిరాశ పరిచింది.
బోనస్‌గా ట్రోల్ బారిన కూడా పడ్డాడు మురుగదాస్. ఈ సినిమా రిలీజ్‌కి ముందు “తమిళ డైరెక్టర్స్ ఆడియన్స్‌ని ఎడ్యుకేట్ చేస్తారు. మిగతావాళ్లు కోట్ల కోసం సినిమాలు చేస్తారు” అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు మురుగ. మదరాసి చూసిన ఆడియన్స్… “ఇంక మీ ఎడ్యుకేషన్ ఆపండి. టికెట్ కొన్న ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేయండి చాలు” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
శంకర్, మురుగదాస్ లాంటి దర్శకులు సోషల్ మెసేజ్‌తో మాస్ సినిమాలు తీసేవారు. కాని ఇప్పుడు వారి కథలు జనాలకు పట్టడం లేదు. ట్రీట్మెంట్లో జనరేషన్ గ్యాప్ కనిపిస్తోంది. ఆడియన్స్ అభిరుచులలో చాలా మార్పులు వచ్చేశాయి. గుండెలు బాదుకొని ఎమోషన్ పండించే రోజులు పోయాయి. ఏ దర్శకుడైనా మారిన పరిస్థితులను పసిగట్టి సినిమాలు తీస్తేనే మనుగడ. లేదంటే ఇలానే ట్రోల్ అవ్వాల్సి వస్తుంది.
