Mass Jathara Movie Review
Telugu360 Rating: 2/5
రెగ్యులర్ కమర్షియల్ సినిమాని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. హీరోయిజం, పాటలు, ఫైటులు, లవ్ ట్రాక్, విలనిజం.. ఇవన్నీ రెగ్యులరే! కానీ ఎందుకో ఒక్కోసారి అవే ప్రేక్షకులకు నచ్చేస్తాయి. అవే కోట్లు కురిపిస్తాయి. ‘ఈ సినిమా ఎందుకు నచ్చింది చెప్మా’ అని అనుమానం వేసేలా కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు కొట్టేశాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే మ్యాజిక్కే అది. ‘ధమాకా’ అందుకు పెద్ద ఉదాహరణ. ఈ సినిమా కథ, కథనం, హీరోయిజం అన్నీ రెగ్యులర్ గానే ఉంటాయి. కానీ మాస్ కి అదే కిక్ ఇచ్చింది. అలాగని ఈ కొలతలతో వచ్చిన ప్రతీ సినిమా ధమాకా అయిపోతుందన్న రూల్ లేదు. ఇప్పుడు ‘మాస్ జాతర’దీ అదే తంతు. ఇది కూడా ఫక్తు కమర్షియల్ మీటర్ లో తీసిన సినిమానే. భూతద్దం పెట్టుకొని వెదికినా కొత్తదనం ఉండదు. మరి ఈ కమర్షియల్ మీటర్ లో మేటర్ వుందా? ‘ఇక మిమ్మల్ని విసిగించే సినిమా చేయను’ అని చెప్పిన రవితేజ ఇచ్చిన మాటపై నిలబడినట్టేనా?
కథ:
లక్ష్మణ్ భేరి (రవితేజ) రైల్వే పోలీస్. దూకుడెక్కువ. సర్విస్ తక్కువ ట్రాన్స్ఫర్లు ఎక్కువ. ఓసారి అడవిపురం అనే ఏరియాకు బదిలీ అవుతుంది. అక్కడ శివుడు (నవీన్ చంద్ర) గంజాయి స్మగ్లర్. తనకు అడ్డొచ్చినవాళ్లందరినీ చంపుకొంటూ.. తన దందా కొనసాగిస్తుంటాడు. ఓసారి పెద్ద ఎత్తున సరుకు కోలకత్తా పంపించాలనుకొంటాడు. ఆ ప్రయత్నాన్ని లక్ష్మణ్ అడ్డుకొంటాడు. ఆ తరవాత ఏం జరిగింది? లక్ష్మణ్ – శివుడు మధ్య ఎలాంటి సమరం నడిచింది? ఈ ప్రయాణంలో లక్ష్మణ్.. శివుడి సామ్రాజ్యాన్ని ఎలా నేలమట్టం చేశాడన్నదే కథ.
విశ్లేషణ :
కథ ఇలా నాలుగు లైన్లలో చెప్పుకొన్నప్పుడే ఇది రొటీన్ సినిమా అనే తలంపు వచ్చేస్తుంది. ఇలాంటి లైన్‌తోనే అద్భుతాలు కూడా చేయొచ్చు. ఎందుకంటే కమర్షియల్ కథల్లో లైన్లు ఇలా రేఖామాత్రంగానే ఉంటాయి. వాటితోనే దర్శకులు మ్యాజిక్ చేస్తుంటారు. ‘విక్రమార్కుడు’ కథగా చెప్పుకొంటే రొటీన్ గానే ఉంటుంది. కానీ సినిమా వేరే స్థాయిలో ఉంటుంది. హీరోయిజం, ఎలివేషన్లు, విలన్, పాటలు ఇలా ప్రతీ అంశం పండింది. కాబట్టే ఆ స్థాయిలో నిలిచింది. రొటీన్ కథలో అలాంటి మ్యాజిక్ ఏం జరక్కపోతే ఆ సినిమా ఎలా ఉంటుందన్నదానికి ‘మాస్ జాతర’ ఓ ఉదాహరణగా మిగిలిపోతుంది. భాను భోగవరపు అనే రచయిత తొలిసారి మెగా ఫోన్ పట్టి తీసిన సినిమా ఇది. రచయిత దర్శకుడిగా మారి సినిమా తీస్తున్నాడంటే తన దగ్గరున్న బెస్ట్ కథే బయటకు తీస్తాడన్నది అందరి ధీమా. ఓ కొత్త దర్శకుడికి రవితేజ లాంటి స్టార్ అవకాశం ఇచ్చాడంటే కచ్చితంగా అలాంటి కొత్తదనం ఏదో ఆశిస్తారు. కానీ ‘మాస్ జాతర’ సినిమాని 360 డిగ్రీల్లో కొలిచినా, ఒక్క డిగ్రీలోనూ ఆ కొత్తదనం కనిపించదు. అసలు ఇలాంటి రొటీన్ కథలో ఏం నచ్చి సినిమాగా మలిచారో అనే అనుమానం ప్రతీ క్షణం వేస్తుంటుంది.
రవితేజ పోలీస్ పాత్రలు చాలా చేశాడు. ఇదీ పోలీస్ పాత్రే. కాకపోతే రైల్వే పోలీస్. అంతే తేడా. హీరోని రైల్వే పోలీస్ చేయడంలో కొత్తగా ఏం సాధించారో అర్థం కాదు. రైల్వే పోలీస్ కంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ల పనితీరు రెగ్యులర్ పోలీస్ లా ఉండదు. పరిధి కూడా తక్కువ. ఆ లిమిటెడ్ సర్కిల్ లోనే ఏం చేసినా. అక్కడే లిమిటేషన్స్ మొదలైపోతాయి. హీరో రైల్వే పోలీస్ కాబట్టి, తన పరిధి తక్కువ కాబట్టి.. నేరాలూ, ఘోరాలూ అన్నీ ఆ పరిధిలోకి బలవంతంగా లాక్కొచ్చినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ పాత్ర ఇంకా అద్వానంగా తయారు చేశారు. టీచర్ అంటూ ఆ పాత్రని ప్రవేశ పెట్టారు. ఆ తరవాత హీరోయిన్ తో గంజాయి అమ్మించారు. అదే వెరైటీ అనుకోవాలి. తన రైల్వే స్టేషన్ లో గంజాయి కాలుస్తున్న వాళ్లని తుక్కు రేగ్గొట్టిన హీరో – అదే గంజాయిని హీరోయిన్ అమ్మితే మాత్రం తనతో డ్యూయెట్ వేసుకొంటాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోలు ఇంతేలే అని సర్దుకుపోవడం మినహా ఏం చేయలేం. ఆ తరవాత గంజాయి అమ్మడానికి గల కారణం అంటూ ఓ కథ చెప్పారు. అది కూడా కృతకంగా అనిపిస్తుంది.
శివుడు అనే పాత్రని చాలా భయంకరంగా పరిచయం చేశారు. కానీ ఆ క్రూయాలిటీ హీరో దగ్గర మాత్రం ఉండదు. ‘నిన్ను జాతర రోజునే చంపుతా’ అని మిగిలిన సమయాల్లో హీరోని పట్టించుకోకుండా వదిలేస్తాడు విలన్. హీరో కూడా అంతే. ‘జాతర వచ్చాక చూద్దాంలే’ అనుకొని, తన ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చినా సరే, విలన్ ని పల్లెత్తు మాట అనడు. హీరో తాత (రాజేంద్ర ప్రసాద్) పాత్ర దగ్గరకు వద్దాం. ఆ పాత్రనీ చాలా పేలవంగా రాసుకొన్నాడు దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు తెరపై కనిపిస్తే కళ్లింత పెద్దవి చేసుకొని చూడాల్సింది పోయి… ఆ పాత్ర రాగానే విసుగు మొదలయ్యేలా ట్రీట్ చేశాడు.
రొటీన్ కథలతో తీసిన సినిమాల్లోనూ దర్శకుడిగా, రచయితగా మార్క్ వేయొచ్చు. మార్కులు సంపాదించొచ్చు. కానీ భాను ఇవేం పట్టించుకోలేదు. దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ రచయితగా తన డొల్లతనం ప్రదర్శించుకొంటూనే వెళ్లారు. పుట్టగొడుగుల కూర తింటే మత్తెక్కడం ఏమిటి? ఆ మత్తులో హీరోతో నిజాలు కక్కించాలని విలన్ బ్యాచ్ ప్రయత్నించడం ఏమిటి? ఏ కాలంలో ఉండి రాసుకొన్నారో ఇలాంటి సీన్లు..? పాత్రో అనే ఓ పాత్ర రాసుకొన్నాడు దర్శకుడు. సినిమా ప్రారంభంలో ‘పాత్రో అనేవాడు ఒకడున్నాడు.. వాడెలా ఉంటాడో ఎవరికీ తెలీదు..’ అంటూ బిల్డప్ ఇచ్చారు. ఆ పాత్రని చివరి వరకూ పరిచయం చేయలేదు. ఆ గ్యాప్ లో అలాంటి పాత్ర ఒకటుందని ప్రేక్షకుడు కూడా మర్చిపోతాడు. తీరా చూస్తే క్లైమాక్స్ లో ఆ పాత్రని పరిచయం చేశారు. ఇచ్చిన బిల్డప్ కీ, చూపించిన విధానానికీ పొంతనే లేకుండా ఆ పాత్రని ముగించేశారు. పైగా ఆ పాత్ర, తన వ్యవహారం చూస్తే ‘పుష్ప 2’ గుర్తుకు వస్తుంది. క్లైమాక్స్ ఫైట్ కూడా ఆ సినిమా నుంచి ప్రభావితమై తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంది.
రవితేజకు ఇది 75వ సినిమా. ఆ ప్రత్యేకత ఈ కథలో కానీ, రవితేజ పాత్రలో గానీ, ఆయన నటనలో కానీ కనిపించవు. రెగ్యులర్ మీటర్ లోనే నటించుకొంటూ వెళ్లిపోయారు. రవితేజ పాత సినిమాలకు సంబంధించిన బీజియమ్స్, డైలాగ్స్, ఆ వింటేజ్ మూమెంట్స్ ఇందులో వాడడానికి ప్రయత్నించారు. కానీ అవేం కిక్ ఇవ్వలేకపోయాయి. శ్రీలీల పాత్ర మరింత తీసికట్టుగా ఉంది. ఇక అందులోని ఆమె ప్రతిభ ఎలా కొలవగలం? శ్రీకాకుళం యాసలో అక్కడక్కడ కొన్ని డైలాగులు పలికింది తప్ప.. పూర్తిగా శ్రీకాకుళం అమ్మాయి పాత్ర కాదు. రాజేంద్ర ప్రసాద్ వీలైనంత వరకూ విసుగు తెప్పించారు. నవీన్ చంద్ర విలనిజం చూడ్డానికే భయంకరంగా వుంది. హైపర్ ఆది జబర్దస్త్ పంచ్‌లు ఈసారి పేలలేదు. అజయ్ ఘోష్ ది రొటీన్ వ్యవహారమే.
భీమ్స్ పాటల్లో కొత్త విషయం ఏమైనా ఉందీ అంటే అది చక్రితో ఓ పాట పాడించడమే. రవితేజపై తనకున్న అభిమానం కొద్దీ.. ఆయన స్టూడియోలో ఉన్న పరికరాలన్నింటినీ వాడి, ఏవో కొన్ని బీజియమ్స్ చేసి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో వాడే ప్రయత్నం చేశారు. కానీ సన్నివేశాల్లో దమ్ము లేకపోవడంతో అవి తేలిపోయాయి. మాటల్లో పవర్ లేదు. స్క్రీన్ ప్లేలో ఊపు లేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఖర్చు విషయంలో వెనుకంజ వేయలేదు. బాగానే ఖర్చు పెట్టింది. కానీ.. సరైన కథపై పెట్టి ఉంటే బాగుండేది.
ఈ సినిమాలో భీమ్స్ ఓ పాట రాశాడు. ‘ఈ పాటలో సాహిత్యం లేదు.. సంగీతం లేదు.. తాళం లేదు.. గొళ్లెం లేదు’ అని. ఈ సినిమాలోనూ అవేం లేవు. కథ, కథనం, మలుపులు, మెరుపులూ ఇవేం లేవు. రవితేజ ఎప్పటిలానే ఫక్తు రొటీన్ కథతో ఏదో మ్యాజిక్ చేద్దామని ప్రయత్నించి భంగపడ్డాడు. ‘ఇకపై మిమ్మల్ని చిరాకు పెట్టను’ అని ఇచ్చిన మాట తప్పాడు. ఆ చిరాకులు, పరాకులు ఈ సినిమాతోనూ కంటిన్యూ అయ్యాయి. మరి వీటికి మాస్ రాజా ముగింపు ఎప్పుడు పలుకుతాడో?
-అన్వర్
Telugu360 Rating: 2/5
