కుందేలు, తాబేలు కథ అందరికీ గుర్తే ఉంటుంది. తాబేలు ఎప్పటికీ తనని అందుకోలేదని కుందేలు ధీమా. కట్ చేస్తే… కుందేలు కునుకు తీసిన గ్యాప్‌లో తాబేలు సైలెంట్‌గా రేస్‌ని ఫినిష్ చేసేస్తుంది. ఈ వారం వచ్చిన సినిమాల పరిస్థితి ఇలానే ఉంది. అనుష్క–క్రిష్ ఘాటీ, శివకార్తికేయన్–మురగదాస్ ‘మదరాసి’ సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా మంచి క్రేజ్, స్టార్ అట్రాక్షన్ ఉన్న సినిమాలే.
ఈ రెండు సినిమాలతో పాటు అసలు రేసులోనే పరిగణలోకి తీసుకుని ‘లిటిల్ హార్ట్స్’ అనే సినిమా వచ్చింది. యూట్యూబర్ మౌళి ఈ సినిమాలో ప్రధాన పాత్ర. ఈటీవీ విన్ నిర్మాణం. బన్నీ వాస్, వంశీ నందిపాటి లాంటి నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారని తప్పితే మరో అట్రాక్షన్ లేదు. కానీ ఈ రోజుల్లో ఆడియన్స్ మెచ్చిందే పెద్ద సినిమా. లిటిల్ హార్ట్స్ కూడా అనూహ్యంగా ఈ రేసులో నెగ్గేసింది. సినిమాకి అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఘాటీ, మదరాసి సినిమాలు పాజిటివ్ టాక్‌లో వెనకబడ్డాయి.
ప్రేక్షకుల మైండ్‌సెట్ మారిపోయింది. సరదాగా నవ్వుకునే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. చిన్న సినిమాలకైతే ఆ నవ్వులే శ్రీరామ రక్ష. సరైన సినిమా సమయంలో లిటిల్ హార్ట్స్ లాంటి లైటర్ వెయిన్ వినోదం పడింది. పైగా చిన్న సినిమాలకు అంచనాలు లేకపోవడం కూడా ఒక ప్లస్. బ్లాంక్ మైండ్‌తో థియేటర్స్‌లో కూర్చున్నప్పుడు ఓ మామూలు సీన్ కూడా పెద్దగా పేలుతుంది. లిటిల్ హార్ట్స్‌లో కూడా అదే జరిగింది. ఇంత తీవ్రమైన పోటీలో హాస్యమనే కమర్షియల్ ఎలిమెంట్ నెగ్గేసింది. ఒక చిన్న సినిమా మౌత్‌టాక్ జనాల్లోకి వెళ్లి చాలా కాలమైంది. ఇప్పుడు ఆ లోటుని తాబేలు లాంటి సర్ప్రైజ్ విన్ తో భర్తీ చేసింది లిటిల్ హార్ట్స్.
