ఫ్యూచర్ సిటీని భవిష్యత్ తరాలు తన పేరు గుర్తుంచుకునేలా నిర్మిస్తానని సీఎం రేవంత్ అంటూంటే అసలు కేటీఆర్ ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదని తేల్చి చెబుతున్నారు. ఫార్మా సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. రైతులు ఫార్మా సిటీ కోసం భూములు ఇస్తే.. ఆయన ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు.
రేవంత్ రెడ్డికి అసలేమీ తెలియదని..ఆయన నిర్ణయాల వల్ల ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం భూములు సేకరిస్తే.. ఫార్మా పరిశ్రమలన్నింటినీ వెళ్లగొచట్టి.. ఫ్యూచర్ సిటీ పేరుతో ఊహాజనిత ప్రాజెక్టును తీసుకొచ్చారన్నారు. నిర్లక్ష్య నాయకుడు పాలిస్తే ఏమవుతుందో దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ అన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని ఇతర ప్రాజెక్టుల కోసం వాడకూడదన్నారు. తాను రెండేళ్ల క్రితమే అసెంబ్లీలో ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించానని అయినా పట్టించుకోలేదన్నారు.ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ చేస్తున్న పనుల వల్ల తీవ్రమైన న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటోందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 20,000 ఎకరాలను సేకరించింది. అప్పట్లో కాంగ్రెస్ రైతులను రెచ్చగొట్టిందని.. తాము వచ్చాక ప్రతి ఎకరాన్ని తిరిగి రైతన్నలకు ఇస్తామని హామీలు ఇచ్చి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు స్నేహితుల కోసం అవే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వారిని నిండా మోసం చేసిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ కోసం.. రైతులకు అన్యాయం చేయవద్దని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
