టీడీపీ నేతల్లో నిమ్మల రామానాయుడుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన ప్రజల్లోనే ఉంటారు. సైకిలేసుకుని నియోజకవర్గం మొత్తం తిరుగుతారు. ప్రజలతో కలిసిపోతారు. ఆయన మంచి చేయడానికి పార్టీలు చూడరు. అందర్నీ సమానంగా చూస్తారు. పార్టీ క్యాడర్ నూ అలాగే చూసుకుంటారు. ఆయన పద్దతిని ఫాలో అయితే ఎమ్మెల్యేలు ఓడిపోరని టీడీపీలో చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన తరహాలో కోటంరెడ్డి కూడా బలపడుతున్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఓ ఇమేజ్‌తో ఉండేవారు. ఇప్పుడు ఆయన మరో రకమైన ఇమేజ్‌కు మారిపోయారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు ఆయన ప్రజల్లో ఉంటున్నారు.. ప్రజల మాటలు వింటున్నారు.. గతంలోనూ ఆయన ఇలాగే ఉండే వారు కానీ..ఆయన పద్దతి వేరుగా ఉండేది. టీడీపీలోకి వచ్చాక ఆయన పద్దతి ఆర్గానిక్ గా మారింది. సొంత క్యాడర్ బాధలు పట్టించుకోవడం కూడా ఆయన ప్రత్యేక పద్దతిలో నిర్వహిస్తున్నారు.
రోజుకు నలభై మంది పార్టీ కార్యకర్తల్ని పిలిపించుకుని.. కష్టాలు, నష్టాలు తెలుసుకుంటున్నారు. సాయం అవసరం అయితే చేస్తున్నారు. కుటుంబపరంగా, ఆర్థికంగా సమస్యలు ఉంటే మార్గాలు చెబుతున్నారు. ఆయన తీరుతో క్యాడర్ కూడా సంతోషంగా ఉంది. అలాగే ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారా.. పార్టీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా వంటివి ఆరా తీస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. చిన్న చిన్న సమస్యలే ఏమైనా ప్రజలు తమ దృష్టికి తెస్తే వెంటనే చేస్తున్నారు.
గతంలో కోటంరెడ్డిపై రకరకాల ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు అలాంటివేమీ ఉండటం లేదు. గతంలో వ్యతిరేకించిన వారు కూడా ఇప్పుడు ఆయనను ప్రశంసిస్తున్నారు. ఆయనలా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉండాలన్న సూచనలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
