కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .. కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులమ్ముకున్నానని.. ఆ పార్టీ కోసం సర్వం త్యాగం చేస్తే తనను మోసం చేశారని ప్రకటించేశారు. ఆయన ప్రకటనతో కాంగ్రెస్ నేతలు కూడా నిజమా అని నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ఆస్తులు అమ్ముకున్నారో లేదో కానీ పీక పిసికి చంపడానికి మాత్రం ప్రయత్నం చేసింది మాత్రం కళ్ల ముందటే ఉందని గుర్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని అసలు లేకుండా చేయడానికి అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు మునుగోడు ఉపఎన్నిక తేవాలని బీజేపీ నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు. ఏడాదిలో ఎన్నికలు ఉంటే. ఉపఎన్నిక తీసుకు రావాల్సిన అవసరం లేదు. అప్పటికే కుదేలైన కాంగ్రెస్ పార్టీని .. అప్పుడే పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా కాపాడలేరని నిరూపించేందుకు ఆ ఉపఎన్నిక తెచ్చారు. ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన రాజకీయం అందరూ చూశారు. వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ గెలవదు..అని ప్రచారం చేయకుండా.. సోదరుడికి తెర వెనుక పని చేశారు.
మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న వాతావరణం ఏర్పడిన తరవాతనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కోసం ఆయన ఏనాడూ పని చేసింది లేదు. రాహుల్ గాంధీ సభలకూ డబ్బులు ఖర్చు ఎందుకు అని దూరంగా ఉన్నారు. ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఏమ్మెల్యేగా పార్టీ కార్యక్రమాలు చేపట్టలేదు. మరి కాంగ్రెస్ కోసం ఆయన ఎప్పుడు ఆస్తులు అమ్ముకున్నారో ఆయనకే తెలియాలని.. ఇతర నేతలంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. కోమటిరెడ్డి బ్రదర్స్ కుబేరులు అవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనేనని అంటున్నారు.
