‘క’ సినిమా విజయం కిరణ్ అబ్బవరంకు మంచి జోష్ ఇచ్చింది. ఆ వెంటనే వచ్చిన దిల్ రుబా నిరాశ పరిచినప్పటికీ తన లైనప్ స్ట్రాంగ్ గా వుంది. ఇప్పుడు ‘కె ర్యాంప్’ సినిమాతో వస్తున్నారు. రాజేష్ దండా నిర్మించిన సినిమా ఇది. జైన్స్ నాని దర్శకుడు. తాజాగా టీజర్ ని వదిలారు.
ఓ సెన్సార్ డైలాగ్ తో మొదలైయింది టీజర్. ఖచ్చితంగా సినిమాలో ఆ డైలాగ్ వుండదు. అక్కడితో అయిపోలేదు… బోలెడు డబల్ మీనింగ్ డైలాగులు వినిపించాయి. కాలేజ్, ప్రేమకథలు, రోమాన్స్, ఫ్రెండ్స్ ఫన్..ఇలా యూత్ కావాల్సిన ఎనర్జీతో టీజర్ ని కట్ చేశారు.
కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ హై ఎనర్జీతో వుంది. ‘అయినా నీకు అందరూ చెప్తూనే వున్నారు. బిల్డప్పులు ఎక్కువైనాయి తగ్గించుకోమని. ఏం చేద్దాం? అవే చేద్దాం’ అంటూ తన మీద తానే ఓ కౌంటర్ వేసుకున్నాడు కిరణ్. ఒక బిల్డప్ షాట్ తోనే టీజర్ ముగించారు. టీజర్ పని టీజ్ చేయడం. కె ర్యాంప్ టీజర్ ఆ పని చేసింది. అక్టోబరు 18న సినిమా వస్తోంది.
