భారత రాష్ట్ర సమితి చీఫ్ ఫామ్ హౌస్లో హోమం నిర్వహించారు. చండీ గణపతి హోమాన్ని ఉదయం పదకొండున్నరకు ప్రారంభించి .. సాయంత్రం ఐదున్నరకు పూర్తి చేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిస్థితులు, రోజు రోజుకు వ్యతిరేకంగా మారుతున్న రాజకీయాల కారణంగా కేసీఆర్ ఈ హోమం నిర్వహించారు. నిజానికి గత నెలలోనే చేయాలనుకున్నారు. ఏర్పాట్లు చేసిన తర్వాత కేసీఆర్ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. దాంతో వాయిదా వేశారు. ఇవాళ పూర్తి చేశారు.
చండీహోమాన్ని నిర్వహించినది ఎవరు అన్నది బయటకు రాలేదు. సాధారణంగా ఆయన అయితే చినజీయర్ తో లేకపోతే విశాఖ స్వరూపానందతో చేయిస్తారు. చినజీయర్ తో మాటలు లేకుండా పోయిన తర్వాత విశాఖ స్వరూపానందతో చేయించారు. ఆయనతో చేయించిన యాగాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు పెద్దగా కలగలేదన్న అభిప్రాయం ఉంది. పైగా ఆయన స్వార్థానికి కాకా పట్టే స్వామిజీ అన్న పేరు పడింది. కేసీఆర్ రెండు ఎకరాలను కోకాపేటలో రెండు రూపాయలకు రాసిచ్చారు కూడా. ఇప్పుడు చండీ యాగాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారా లేదా అన్నది స్పష్టత లేదు.
ఎప్పుడు యాగం నిర్వహించినా కుటుంబసభ్యులంతా ఉండేవారు. ఈ సారి మాత్రం కవిత లేకపోవడం లోటుగా కనిపించిందని బీఆర్ఎస్ నేతలంటున్నారు. కవితను పూర్తిగా కుటుంబానికి దూరం పెట్టారు. రాజకీయంలో వచ్చిన విబేధాలు కుటుంబపరమైన బంధాలను కూడా తెంపేశాయన్న నిర్వేదం బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతల్లో కనిపిస్తోంది.
