కొత్త పార్టీ ప్రకటించే విషయంలో కవిత వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆమె చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఆలోచనలేదని.. తాను వారిని సంప్రదించలేదని.. వారు కూడా తనను సంప్రదించలేదని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో బతుకమ్మ ఉత్సవాల్లో కవిత పాల్గొననున్నారు. కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. ఆ గ్రామస్తులు కవితను ఆహ్వానించారు. సంతోషంగా వెళ్తున్నానని.. ఇందులో రాజకీయం లేదని కవిత అంటున్నారు.
తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కూతుర్ని తాను ఒక్కదాన్నేనని కవిత ఆవేదనతో చెప్పారు. కేటీఆర్ సోషల్ మీడియాల.. సంతోష్ రావు సీక్రెట్ మీడియా.. బీఆర్ఎస్ మీడియా అన్నీతనపైనే దాడి చేస్తాయని తెలుసని అలాగే జరుగుతోందన్నారు. అన్ని అంశాలను తాను ఎదుర్కొంటానన్నారు. రాజకీయపార్టీ ప్రస్తావన వచ్చినప్పుడు.. ప్రజాస్వామ్యంలోఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా మంచిదేనన్నారు. ఎవరూ స్పేస్ ఇవ్వరని.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందేన్నారు.
అయితే తాను పార్టీ అంటూ పెడితే బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న సంకేతాలను మాత్రం కవిత ఇచ్చారు. తనతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతల సంఖ్య ఎక్కువని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చి ఎమ్మెల్సీ పదవి తనకు అవసరం లేదని.. తాను రాజీనామా చేశానన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో నిబంధనలకు అనుగుణంగా రాజీనామా చేసినా ఎందుకు ఆమోదించడం లేదో తెలియడం లేదన్నారు. మరోసారి రాజీనామా లేఖ కావాలన్నా ఇస్తానని స్పష్టం చేశారు.,
కవిత బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలను బట్టి పార్టీ ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో సంచలనాత్మక పరిణామాలు ముందు ముందు ఉంటాయని ఆమె ఊహిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
