అసెంబ్లీకి రాలేదని చర్యలు తీసుకుంటే రాజీనామాలు చేయాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతల సమావేశంలో కూడా తన ఆలోచన చెప్పారు. ఆయన రాజీనామా చేయమంటే .. ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తారు. చేయకపోతే తాడేపల్లికి పిలిపించి చేయిస్తారు. వైసీపీలో జగన్ నిర్ణయమే ఫైనల్. జగన్ నోట రాజీనామాల మాట విన్న తర్వాత వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలా అనిపించిందో కానీ.. ప్రస్తుతం ఆయన రాజకీయ నిర్ణయాలను పరిశీలిస్తున్న వారికి.. జగన్ తీసుకునే నిర్ణయాల్లో అదే అత్యుత్తమం అవుతుందని విశ్లేషిస్తున్నారు.
అనర్హత వేటు వేస్తే రాజీనామా అవసరం పడదు. తామే రాజీనామాలు చేస్తే ఆనందంగా ఆమోదిస్తారు స్పీకర్. ఈ క్రమంలో చర్యలు అన్నారంటే.. జీతభత్యాలు నిలిపివేయడం. ఇటీవల అసెంబ్లీకి రాని.. పని చేయని ఎమ్మెల్యేలకు జీతభత్యాలు ఎందుకివ్వాలని స్పీకర్ అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీకి రాకపోయినా ఎమ్మెల్యేలు.. అసెంబ్లీకి వచ్చినట్లుగా టీఏ , డీఏలు పొందుతున్నారు. ఇతర అలవెన్స్లు కూడా పొందుతున్నారు. వాటన్నింటిని క్యాన్సిల్ చేసే ఆలోచనలో స్పీకర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి చర్యలు తీసుకుంటే జగన్ రాజీనామా చేస్తానంటున్నారు. అదే జరిగితే ఉపఎన్నికలు వస్తాయి. తమకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా వేధించారని.. అసెంబ్లీకి వెళ్లకపోతే జీతాలు కూడా ఆపేశారని చెప్పి ప్రజల వద్దకు ఎన్నికలకు వెళ్తే .. వారి సానుభూతి లభిస్తుందని జగన్ అనుకుంటున్నారు. జగన్ రాజకీయ వ్యూహాల్లో కుట్రలు, సానుభూతి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం ఉందని జగన్ నమ్ముతున్నారు. ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారని ఆయన చెబుతున్నారు. దీన్ని నిరూపించడానికి ఉపఎన్నికలు మంచి చాయిస్. జగన్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తే.. మరోసారి గోల కొట్టినట్లేనని భావిస్తున్నారు. మరి జగన్ మాటల్లో చెప్పినట్లుగా ధైర్యం చేస్తారా ?
