అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పుడు నిర్ణయం అని జగన్కు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హితవు పలికారు. ఆయన జగన్ రెడ్డి శ్రేయోభిలాషి అని అందరికీ తెలుసు. జగన్ మంచి కోరేవారే ఈ సలహాలు ఇస్తున్నారు. ఒక్క కోమటిరెడ్డి కాదు చంద్రబాబు అంటే ఇష్టం లేని.. జగన్ అంటే ఇష్టపడే వారంతా ఇదే చెబుతున్నారు.. చివరికి ఉండవల్లి కూడా. ఇప్పటి వరకూ వైసీపీ అధినేత జగన్కు ఒక్కరంటే ఒక్కరైనా అసెంబ్లీకి వెళ్లకపోవడం మంచిదే అని చెప్పి ఉండరు. ఒక్క సజ్జల మాత్రమే ఈ సలహా ఇచ్చి ఉంటారు. ఆయన అజెండా వేరు.
హోదా కోసం అసెంబ్లీ బహిష్కారణా.. సిగ్గనిపించదా?
ప్రజల కోసం అసెంబ్లీ బహిష్కరణ చేశామని చెప్పుకోవడం వేరు.. కానీ ఇప్పుడు చేసింది.. హోదా కోసం బహిష్కరణ. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ఆయన తాను అసెంబ్లీ రాను.. ప్రజలు ఎన్నుకున్న ఇతర ఎమ్మెల్యేలను వెళ్లనివ్వను అని మంకుపట్టు పట్టారు. దేశంలో ఇప్పటి వరకూ ఉన్న సంప్రదాయమే ఉంది. పది శాతం కంటే తక్కువ ఎమ్మెల్యేలు ఉంటే స్పీకర్ ఇస్తే తీసుకోవాలి లేదంటే లేదు. స్పీకర్ ఇవ్వనప్పుడు అడుక్కోకూడదు.. ఇచ్చినా.. మీ దయ అవసరం లేదని తిప్పికొట్టే స్థాయిలో ఆత్మగౌరవ రాజకీయాలు ఉండాలి. కానీ ఇక్కడ దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనే రేంజ్ లో అడుక్కుంటున్నారు.
ఒక్కరైనా మంచి పని చేశారని చెప్పారా ?
రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏకాభిప్రాయం రాకపోవచ్చు. కనీసం తమ పార్టీలో అయినా దాన్ని ఆమోదించాలి. కానీ వైసీపీ అధినేత జగన్ ..తాను తీసుకున్న అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం మంచిదని ఒక్కరు అయినా చెప్పగలరా?. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తాము అసెంబ్లీకి వెళ్తామనే అంటారు. జగన్ మాట ధిక్కరించలేక కక్కా మింగలేక ఉంటున్నారు. వైసీపీ క్యాడర్ కూడా అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని సమర్థించరు. ఎందుకంటే.. ప్రజాస్వామ్యం నడిచేది అసెంబ్లీ ద్వారానే. వెళ్లకపోతే ఇక రాజకీయాలెందుకు ?
అలాంటి నాయకత్వాన్ని నమ్ముకుంటే అందరికీ శంకరగిరి మాన్యాలే
రాజకీయం అంటే తెలియని వారి నాయకత్వంలో ఉండటం అంటే.. ఆయా నాయకులకు శంకరగిరి మాన్యాలు తప్ప ఏ దారి ఉండదు. రాజకీయం అంటే దోపిడీ అనుకుని ఇష్టం వచ్చినట్లుగా ఆ పని చేసి ఎంతో మంది నమ్ముకున్న వాళ్లను జైలుకు పంపారు. మిగిలిన నేతలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తున్నారు. ఇలాంటి నాయకుడ్ని నమ్ముకుని పార్టీ బాగుపడుతుందా.. నేతలు బాగుపడతారా?
