ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను అనుకుని పొగుడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పథకాల అమలుపై ఆయన ఓ పెద్ద ట్వీట్ పెట్టారు. ఈ మధ్య ఆయన ప్రెస్మీట్లో మాట్లాడాల్సిన పాయింట్లు మొత్తాన్ని ఇలా ట్వీట్ల రూపంలో పెడుతున్నారు. పథకాల అమలుపై ఈ ట్వీట్ సారాంశం చూస్తే.. పథకాల అమలు ఇంత పక్కాగా జరుగుతోందని చెబుతున్నారా అని .. వైసీపీ క్యాడర్ కూడా ఆశ్చర్యపోతోంది.
ఉచిత బస్సు స్కీమ్ అమలుపై జగన్ ప్రచారం
ఉచిత బస్సు గురించి ఆయన మంచి ప్రచారం ఇచ్చారు. రాష్ట్రంలో 11 వేల బస్సులు ఉంటే 6,700 బస్సుల్లో మాత్రమే ఉచితం ఇస్తున్నారని ప్రశ్నించానని అనుకున్నారు. కానీ బస్సుల్లో ఏసీ బస్సులు, అంతర్రాష్ట్ర ప్రయాణ బస్సులు ఉంటాయి. వాటిలోనూ ఉచితం అని ఎవరూ అనుకోలేరు. స్లీపర్ బస్సుల్లోనూ ఉచితం కావాలని ప్రజలు కూజా కోరుకోరు. పేదలకు ఏ బస్సుల్లో అవసరమో.. ఆ బస్సుల్లో పథకం అమలవుతోంది. ఆ విషయాన్ని ఆయన అంగీకరించారు. అమ్మండి 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే 30 లక్షల మంది పిల్లలకు ఇవ్వలేదని వాదించారు. అంటే అరవై లక్షల మందికి ఇచ్చారని అంగీకరిస్తున్నారన్నమాట. నిజానికి అమ్మఒడి రానిది కేవలం.. ధనవంతులకు మాత్రమే. జగన్ రెడ్డి పథకాన్ని అర్హతలతో సంబంధం లేకుండా అందరికీ ఇవ్వాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో పెట్టిన అడ్డగోలు అర్హతల గురించి గుర్తున్నట్లుగా లేదు.
పథకాలపై వస్తున్న సానుకూలతతో జగన్ కు కడుపు మంట
జగన్ రెడ్డి పెట్టిన ట్వీట్ చూస్తూంటే.. టీవీలో ఇచ్చిన ఓ ప్రకటనను చూసి …ప్రజలు ముఖ్యంగా మహిళలు సంతోషంగా ఉన్నారని భావించి.. అలా ఉండకూడదని.. వారికి ఏదో ఎగ్గొట్టారని ప్రచారం చేయడానికి ఈ ట్వీట్ పెట్టినట్లుగా ఉంది. జగన్ రెడ్డి తన పథకాలు ఏవో ప్రజలు రాతలు మార్చాలని చెప్పుకోవాలనుకున్నారు. కానీ ఆయన పథకాల కన్నా.. స్కీమ్స్ పేరుతో చేసిన స్కామ్సే ఎక్కువ. ఉచిత బస్సు ద్వారా మహిళా ప్రయాణికులకు ఎంతో కొంత మేలు జరుగుతోందన్న ఫీడ్ బ్యాక్ రావడంతోనే ఆయన విషం చిమ్మడం ప్రారంభించారు. అంత కంటే ఎక్కువే తామిచ్చామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పథకాలపై ఇలాగే జగన్ ఏడుపులుండాలంటున్న టీడీపీ నేతలు
గతంలో జగన్ రెడ్డి ఎన్ని పథకాలు అమలు చేసినా.. ఒక్క పథకం కూడా అమలు చేయలేదని వాదించేవారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఒక్కరికీ రుణమాఫీపై కాలేదని వాదించేవారు. ఇప్పుడు అలా చెప్పలేకపోతున్నారు. అర్హులు అందరికీ పథకాలు అందుతున్నాయని కానీ ధనవంతులకు కూడా ఇవ్వాలన్నట్లుగా ఆయన డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. తమ పార్టీ నేతలకు అక్రమంగా కట్టబెట్టిన వికలాంగుల పింఛన్లు రద్దు చేస్తూంటే.. ఆయన కడపుమండిపోతోంది. దోపిడీని కట్టడి చేస్తూంటే ఆయనకు ఆగ్రహం వస్తోంది. జగన్ ఇలాగే పథకాల మీద ఏడ్చూతూ పోతే చాలని..తమ పథకాలకు ఆయన చేసే పబ్లిసిటీనే ఎక్కువ ఉంటుందని టీడీపీ నేతలు.. అనుకుంటున్నారు.
