ప్రతిపక్ష నేత హోదా ఇప్పించాలని హైకోర్టులో జగన్ రెండోసారి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. ప్రతివాదులుగా జగన్ పేర్కొన్న స్పీకర్ , అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ వ్యవహారాల మంత్రులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. జగన్ రెడ్డి ఇంతకు ముందు కూడా ఇలాంటి పిటిషన్ దాఖలు చేశారు. అది పెండింగ్ లో ఉండగానే మళ్లీ పిటిషన్ వేశారు.
అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు. స్పీకర్ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధమైతే తప్ప ఎలాంటి ఆదేశాలు ఇవ్వవు. ప్రతిపక్ష నేత హోదా అంశంలో గతంలో పదిశాతం సీట్లు లేకుండా హోదా కావాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల కూడా అనుకూలమైన తీర్పులు రాలేదు. హోదా లేకపోయినంత మాత్రాన ప్రతిపక్ష నేత కాకుండా పోయే అవకాశం లేదు. కానీ ఎన్డీఏకు సపోర్టు చేస్తున్నందున తనను కూడా మిత్రపక్షంగా పరిగణిస్తారని భయపడుతున్నారేమో కానీ ప్రతిపక్షం అనే ముద్ర కావాల్సిదేనని జగన్ పట్టుబడుతున్నారు.
అందుకే అసెంబ్లీకి వెళ్లడంలేదు. ఆయన ఎమ్మెల్యేలను వెళ్లనీయడం లేదు. కానీ తాను వెళ్లమనే చెబుతున్నానని వారు వెళ్లడం లేదని అంటున్నారు. ఇలాంటి పిటిషన్లలో విచారణలు అంత తేలికగా ముందుకు సాగవు. స్పీకర్ ఇలాంటి అంశంపై అసలు కౌంటర్ దాఖలు చేస్తారా లేదా అన్నది కూడా స్పష్టత ఉండదు. అయినా జగన్ రెడ్డి అనర్హతా వేటు వేయకుండా.. న్యాయపోరాటం చేస్తున్నామని ఓ కారణం చెప్పడానికి ఈ పిటిషన్లు వాడుకున్నట్లుగా కనిపిస్తోంది. కోర్టులో ఉన్నా.. అనర్హత వేటు వేశారని చెప్పుకోవడనికి పనికి వస్తుదన్నట్లుగా జగన్ వ్యూహం ఉంది.
