భారతదేశం ఇరుగు, పొరుగు దేశాల్లో జరుగుతున్న పరిణామాల తర్వాత చాలా మంది భారత్ లోనూ అలాంటి తిరుగుబాటు వస్తుందని, రాదని కూడా విశ్లేషణలు ప్రారంభించారు. అయితే ఆయా దేశాల్లోని పరిస్థితులను విశ్లేషించినప్పుడు అక్కడ ప్రజల్లో అసహనం పెరిగిపోవడానికి ప్రభుత్వాలు కారణం అయ్యాయి. వారి రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడం, నిర్లక్ష్యం, అవినీతి సహా అన్నీ కలిసి ప్రజల్ని ఇక చావో..రేవో తేల్చుకోవాల్సిందే అన్న ట్లుగా మార్చడంతో తిరుగుబాటు చేశారు. పాలకుల్ని తరిమికొట్టారు. కానీ అలాంటి పరిస్థితులు ఇండియాలో ఒక్క శాతం కూడా లేవు.
నేపాల్, బంగ్లా, లంకల్లో ప్రజలకు కనీస సదుపాయాలు మృగ్యం
ప్రజా తిరుగుబాటు జరిగి ప్రధానులు సైతం పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడిన. మూడు భారత పొరుగు దేశాల్లో పాలకుల చేతకాని తనం చాలా ఎక్కువగా ఉంది. శ్రీలంకనే తీసుకుంటే.. అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసే సమయానికి ఆ దేశంలో ప్రజలకు కరెంట్ లేదు. పెట్రోల్ లేదు. ధరలు ఆకాశానికి అంటాయి. ఇంత జరుగుతున్నా ఏమీ చేయని ప్రభుత్వాన్ని, అప్పటికీ విలాసాలలో ఉంటున్న పాలనకుల్ని చూసి ఎవరు మాత్రం సైలెంటుగా ఉండగలరు?. నేపాల్లోనూ అదే పరిస్థితి. అక్కడి యువతకు ఉద్యోగావకాశాలు దాదాపుగా లేవు. అవినీతి పెరిగిపోయింది. బంగ్లాలో పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. షేక్ హసీనా నియంతృత్వ ధోరణి.. అణిచివేత కారణంగా ప్రజలు తిరగబడ్డారు. ఆ మూడు దేశాల పరిస్థితులతో కంపేర్ చేస్తే.. భారత్ లో అత్యున్నత జీవన ప్రమాణాలు ప్రజలకు ఉన్నాయి.
అవకాశాల వేటలో తీరిక లేని భారత యువత
ప్రస్తుతం భారత యువతకు తీరిక లేదు. వారి కళ్ల ఎదుటగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కెరీర్ లో పరుగులు పెడుతున్నారు. ఐటీ రంగం నుంచి వ్యవసాయ రంగం వరకూ అన్ని చోట్ల పని చేసుకుంటే.. కావాల్సినంత ఉపాధి దొరుకుతుంది. వారికి తిరుగుబాటు చేయాల్సిన అవసరం లేదు. అవినీతి విషయంలోనూ రాజకీయ నేతలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అత్యాశకుపోయేవారు కొంత మంది ఉన్నా.. వారికి ఎప్పటికప్పుడు షాకులు ఇస్తున్నారు. అవినీతి పై , అవినీతి నేతలపై చర్యలు తీసుకునే విషయంలో ప్రజలకు కాస్త అసంతృప్తి ఉన్నా.. అటూ ఇటూగా చర్యలు తీసుకుంటారన్న నమ్మకంతోనే ఇంకా ప్రజలు ఉన్నారు. అది ఒక్కటే తిరుగుబాటుకు కారణమయ్యే అవకాశం లేదు.
ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాల చురుకుదనం
ఇక్కడ ప్రభుత్వాలు తమ బాద్యతలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం లేదు. ఓటు బ్యాంక్ ను కాపాడుకోవడానికి.. మళ్లీ ఎన్నికల్లో మరింత మందిని తమ వైపు తిప్పుకోవడానికి.. ఆయా వర్గాలకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చే పథకాలతో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. అటు కేంద్రం… ఇటు రాష్ట్రం ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నాయి. తేడా వస్తే మొత్త ఆగిపోతాయి. అందుకే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న వారెవరూ.. అసంతృప్తి వ్యక్తం చేయరు. మిగతా వర్గం.. ఉద్యోగ, వ్యాపార అవకాశాలను అందుకోవడంలో చాలా బిజీగా ఉంటుంది. కారణం లేకుండా ప్రభుత్వపై తిరుగుబాటు చేసేంత తీరిక ఇప్పుడు భారత యువతకు లేదు. అందుకే భారత్ లో ఆ మూడు దేశాల్లో ఉన్న పరిస్థితులు వచ్చ అవకాశాలు అణుమాత్రంగా లేవు.
అదే సమయంలో ఆ మూడుదేశాల్లోని రాజ్యంగాల కన్నా… భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. దేశానికి రక్షణగా నిలిచే వ్యవస్థలు పకడ్బందీగా పని చేస్తున్నాయి. లోపాలున్నా… వ్యవస్థలలో కొంత మంది దారి తప్పినా.. ప్రస్తుతానికి భారత్ లో అరాచక విప్లవం వచ్చే అవకాశం మాత్రం లేదు.
