రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు విపరీతమైన ప్రచారం లభిస్తోంది. ఓ వైపు అమెరికా .. రష్యాపై విరుచుకుపడుతోంది. ఆ దేశంతో వ్యాపార, ఇతర సంబంధాలు పెట్టుకున్న వారిపై గుర్రుగా ఉంటోంది. భారత్ విషయంలో ఇంకా కఠినంగా ఉంటుంది. పెద్ద ఎత్తున పన్నులు విధించారు. ట్రేడ్ డీల్ కు అంగీకరించకుండా సతాయిస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత్ కు పుతిన్ రావడం.. ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానం పలకడం.. దేశవ్యాప్తంగా భిన్న చర్చలకు కారణం అవుతోంది.
రష్యాతో అనాదిగా భారత్‌కు సత్సంబంధాలు
చరిత్రాత్మకంగా, భారత్-రష్యా స్నేహితులుగా పేరుపొందాయి. పుతిన్ యుగం రష్యాలో ప్రారంభమైన తర్వాత ఈ సంబంధాలు మరింత బలపడ్డాయి. భారత్-రష్యా సంబంధాలు 1947లో స్వాతంత్ర్యం పొందిన తర్వాతే ప్రారంభమయ్యాయి. సోవియట్ యూనియన్ భారత్‌కు ఆయుధాలు, ఆర్థిక సహాయం అందించింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై అమెరికా-చైనా మద్దతును వ్యతిరేకిస్తూ, సోవియట్ యూనియన్ భారత్‌కు మద్దతు ప్రకటించింది. పుతిన్ 2000లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, ఈ సంబంధాలు విలువైనవిగా మారాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2012లో పుతిన్‌ను భారత్‌కు విలువైన స్నేహితుడుగా పేర్కొన్నారు.
మోదీ, పుతిన్ మధ్య అనేక సమావేశాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ మంచి అనుబంధం కలిగి ఉన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు వారు 20 కంటే ఎక్కువసార్లు కలిశారు. పుతిన్ మోదీని ప్రియమైన స్నేహితుడు అని పిలుస్తారు. పుతిన్ భారత్ కు ఎప్పుడూ మద్దతుగానే ఉంటున్నారు. భారత్ ఆయుధాల్లో 60 శాతం రష్యా నుంచి వస్తాయి . S-400 మిస్సైల్ సిస్టమ్ వంటి అత్యాధునికమైనవి రష్యానే ఇస్తుంది. ఆపరేషన్ సిందూర్‌లో ఈ వెపనే కీలకంగా పని చేసింది. భారత్ రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తూ ఇతర దేశాల ఒత్తిళఅలను పట్టించుకోలేదు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థత చూపిచింది.
సవాళ్లు కూడా!
రష్యా , చైనా మధ్య కూడా మంచి స్నేహం ఉంది. చైనా పాకిస్తాన్‌కు ఆయుధాలు అందిస్తుంది, ఇది భారత్‌కు సమస్య. కానీ పుతిన్ భారత్ దేశానికి ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదు. పుతిన్ భారత్‌కు నిజమైన స్నేహితుడేనని అనుకోవచ్చు. చరిత్ర, రక్షణ, ఆర్థిక మద్దతు ఆధారంగా ఈ నిర్దారణకు రావచ్చు. కానీ ఇది రెండు దేశాల జాతీయ ఆసక్తులపై ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
