స్థిరాస్తులు కొనుగోలు చేసేవారు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు సొంతంగా ఇళ్లల్లో నివసించేందుకు..మరొకరు భవిష్యత్ లో పెట్టుబడులుగా పెట్టేందుకు స్థిరాస్తులు కొంటూ ఉంటారు. నివాసం ఉండాలనుకుంటే ఉద్యోగం, వ్యాపారం ఉన్న చోటకొనుగోలు చేయక తప్పదు. కానీ పెట్టుబడి కోసం అయితే ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు.. మంచి రిటర్న్స్, విలువలు పెరిగే చోట కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పరిస్థితుల్లో మెట్రో నగరాల్లో ఇళ్ల స్థలాల ధరలు బాగా పెరిగిపోయాయి. అపార్టుమెంట్ల ధరలు కూడా వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత ఉండే ధరను ఇప్పుడు చెబుతున్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు ఇన్వెస్ట్ మెంట్ అంటే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కరీంనగర్, వరంగల్, కాకినాడ, రాజమండ్రి వంటి నగరాల్లో ఇళ్ల స్థలాల ధరలు గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెరుగుతున్నాయి.
ద్వితీయ శ్రేణి నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలను పెంచుతోంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నగరంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ధరల పెరుగుదలకు దోహదపడ్డాయి. ద్వితీయ శ్రేణినగరాల్లో జనాభా పెరుగుదల , హైదరాబాద్ వంటి మహానగరాల నుండి వలసల కారణంగా ఇళ్లకు డిమాండ్ పెరిగుతోందని మార్కెట్ వర్గాలుచెబుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో విజయవాడలో స్థలాల ధరలు సగటున 10-15 శాతం వార్షిక వృద్ధి చెందాయి. విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్ వంటి ప్రాంతాల్లోనూ
ఇలాంటి డిమాండే కనిపిస్తోంది.
ద్వితీయ శ్రేణి నగరాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారాయి, ఎందుకంటే ఈ నగరాల్లో స్థలాల ధరలు హైదరాబాద్ లేదా ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇంకా సరసమైనవిగా ఉన్నాయి. అందుకే పెట్టబడిగా ఆలోచించే ముందు ద్వితీయ శ్రేణి నగరాలవైపు ఓ లుక్కేస్తే బెటరని నిపుణుల సలహా.
