భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. 2047 నాటికి ఈ రంగం 5-7 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌గా అభివృద్ధి చెంది, దేశ జీడీపీలో 20 శాతానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, మార్కెట్ డిమాండ్, డెవలపర్లు, పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న ఆసక్తి వంటి కారణాలతో దీర్ఘకాలిక వృద్ధికి అవకాశం ఉందని క్రెడాయ్ అంచనా వేస్తోంది.
కొలియర్స్ ఇండియాతో కలిసి క్రెడాయ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, గ్రేడ్ ‘ఏ’ కార్యాలయాలు, గిడ్డంగుల స్థలాల స్టాక్ 2047 నాటికి 2 బిలియన్ చదరపు అడుగులను అధిగమించగలదు. వార్షిక గృహ అమ్మకాలు రెట్టింపై 10 లక్షలు యూనిట్లకు చేరవచ్చని అంచనా వేసింది. భారతీయ మార్కెట్ వృద్ధి పట్టణాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జనాభా మార్పులు సుస్థిరాభివృద్ధి వంటి నిర్మాణాత్మక అంశాలపై ఆధారపడి ఉందిని నివేదిక వెల్లడించింది.
భారతదేశంలో వేగంగా పట్టణీకరణ జరుగుతోంది. దేశంలో 2050 నాటికి 900 మిలియన్ల మంది జనాభాలో 53 శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారని అంచనా. ప్రస్తుతం ఇది 37 శాతంగా ఉంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు గ్రోత్ కారిడార్లుగా విస్తరించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ రంగం భావిస్తోంది. ఈ వృద్ధి రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక పాత్ర పోషిస్తుందని అంచనా వేశారు.
