విద్యుత్ శాఖ ఏడీఈగా పని చేస్తున్న వ్యక్తి జీతం రూ.లక్ష వరకూ ఉంటుంది. ఆయన ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తే.. రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఇంత ఆస్తి ఆయన ఎలా సంపాదించగలిగాడా అని సామన్యుడు కూడా ఆశ్చర్యపోతాడు. అతని ఇంట్లో దొరికిన నోట్ల నోట్లలు చాలా చిన్న మొత్తం. వాటితో పదుల సంఖ్యలో కుటుంబాలు స్థిరపడిపోతాయి. ఇలాంటి అవినీతి పరులు ఎందరో దొరుకుతున్నారు. వీరి అవినీతిపై ఎందుకు తిరుగుబాటు రావడంలేదు…?
ఏ అధికారి దొరికినా వందల కోట్ల ఆస్తులే !
ఏసీబీ ఇటీవల కొంత మంది ఇరిగేషన్ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఒక్కొక్కరికి కనీసం రెండు వందల కోట్లకు తక్కువ ఆస్తులు లేవు. ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారి. నిజానికి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏ ప్రభుత్వ అధికారిని పరిశీలించినా వారి జీతానికి.. కూడబెట్టుకునే ఆస్తులకు పొందనే ఉండదు. లక్ష రూపాయల జీతంగల ప్రభుత్వ ఉద్యోగి.. పారిశ్రామిక వేత్త స్టైల్ లో లైఫ్ స్టయిల్ నిర్వహిస్తూ ఉంటారు. అంతా ఎలా సాధ్యం అన్నది అందరికీ తెలుసు. బాగా డబ్బులు వచ్చే ఉద్యోగం చేస్తున్నారని అర్థం చేసుకుంటారు. ఆ డబ్బులు జీతం కాదు.. లంచం.
ప్రజల రక్తాన్ని పీల్చి వందల కోట్లు పోగేస్తారా ?
ప్రజలకు సేవ చేసేందుకే అన్ని విభాగాలు ఉన్నాయి. ఓ విద్యుత్ కనెక్షన్ కావాలంటే.. ఎన్నో కొర్రీలు పెడతారు. కానీ డబ్బులు ఇస్తే మాత్రం.. ఏమీ ఉండవు.. రోడ్డు మీద కట్టుకున్న ఇంటికి అయినా కనెక్షన్ ఇచ్చేస్తారు. ఇరిగేషన్ శాఖలో పనులు సరిగ్గా చేయకపోయినా బిల్లులు చెల్లిస్తారు. రెవిన్యూలో అయితే చెప్పాల్సిన పని లేదు. ప్రతి విభాగంలోనూ ఇలా అడ్డోగలుగా సంపాదించుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ప్రజలకు పనులు చేయాల్సిన వారు.. బిల్లులు రిలీజ్ చేసే అధికారం ఉన్న ప్రతి ఒక్కరూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లందరిపై దాడి చేసి సోదాలు చేస్తే.. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఆర్థికసమస్యలన్నీ తీరిపోతాయని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఇలాంటి అవినీతిపై తిరుగుబాటు ఎప్పుడు ?
అందరూ రాజకీయ అవినీతి గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అధికారుల అవినీతి గురించి తక్కువ మాట్లాడుతూ ఉంటారు. వాళ్లు చేయట్లేదా అని వీళ్లు.. వీళ్లు చేయట్లేదా అని వాళ్లు… ఇద్దరూ కలిసిపోయి కూడా లంచాలు మేసేస్తున్నారు. ప్రజల్ని పీడిస్తున్నారు. ఇలాంటి అవినీతిపై తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అధికారులకు సపోర్ట్ చేసే వారిపైనా తిరుగుబాటు రావాలి. అప్పుడు మాత్రమే దీనికి అడ్డుకట్ట పడుతుంది. ప్రజలు కూడా.. ఎంత తక్కువ లంచం తీసుకుంటే.. అంత మంచిదన్నట్లుగా మారిపోయారు. లేకపోతే విద్యుత్ కనెక్షన్ కోసం పడే పాట్లను వారు భరించలేరు. రెవిన్యూ సమస్యలు పరిష్కరించుకోలేరు. మొత్తంగా.. ఉద్యోగులు, రాజకీయ అవినీతిపై తిరుగుబాటు వచ్చినప్పుడే.. ఎంతోకొంత మార్పు వస్తుంది. లంచాలు తప్పదనుకున్న మైండ్ సెట్ ను ప్రజలు మార్చుకోవాల్సి ఉంది.
