లేడీ ఓరియెంటెడ్ అనే జోనర్‌ని టాలీవుడ్ దాదాపు మర్చిపోయింది. హీరోలు, వాళ్ల ఎలివేషన్లూ అంటూ మురిసిపోతూ నాయికా ప్రాధాన్యం ఉన్న కథల్ని చిన్న చూపు చూస్తోంది. అప్పుడప్పుడూ అమ్మాయిల చుట్టూ కథలు తిప్పితే… కొత్త డైమెన్షన్ కనిపిస్తుందని సినీ రూపకర్తలు చెబుతుంటారు. కానీ ఆ అవకాశం లేకుండా పోతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకూ మార్కెట్ ఉంటుందని, ఆ సినిమాలూ చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారని చాలాసార్లు నిరూపితమైంది. కానీ ఆ దిశగా ఎందుకో ఆలోచించడం లేదు.
ఆమధ్య ‘పరదా’ అనే సినిమా వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన సినిమా అది. ‘హీరోల కోసమే కాదు.. హీరోయిన్ల కోసం కూడా సినిమాకు రావాలి.. వాళ్లకూ విజిల్స్ పడాలి’ అంటూ పరదా దర్శకుడు తన ఉద్దేశ్యాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. పరదా లాంటి సినిమాలు హిట్టయితే లేడీ ఓరియెంటెడ్ కథలకు కొంత ఊతం వచ్చేది. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది.
ఇప్పుడు అనుష్క వంతు వచ్చింది. తను ప్రధాన పాత్ర పోషించిన ‘ఘాటీ’ ఈ వారమే విడుదల కాబోతోంది. ఈ సినిమా అనుష్కకూ, క్రిష్‌కూ ఎంత కీలకమో, టాలీవుడ్ కథలకు కూడా అంతే కీలకం. అనుష్కని ఓ మాస్ హీరో రేంజ్ లో చూపించబోతున్న కథ ఇది. ఇలాంటి ప్రయత్నాలు వర్కవుట్ అయితే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మరిన్ని పుట్టుకొస్తాయి. అనుష్కకు మంచి మార్కెట్ ఉంది. ‘అరుంధతి’, ‘భాగమతి’ లాంటి సోలో హిట్ లు తన ఖాతాలో ఉన్నాయి. `అరుంధతి` అయితే ఓ చరిత్ర. లేడీ ఓరియెంటెడ్ కథలకు ఎంత విస్కృతి ఉందో చెప్పిన సినిమా అది. ‘భాగమతి’ కూడా అప్పట్లో మంచి వసూళ్లే అందుకొంది. అనుష్క లాంటి సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరోయిన్‌కు మంచి కథ పడితే వసూళ్లు ఊహించని రీతిలో ఉంటాయి. ఆ అవకాశం ‘ఘాటీ’తో రాబోతోంది. ఈ సినిమా హిట్టయితే.. కథల రూపు రేఖలు కొద్దిగా మారే అవకాశం ఉంది. అనుపమ, సమంత, తమన్నా, సాయి పల్లవి లాంటి కథానాయికల కోసం మంచి పాత్రలు రాసే ఛాన్స్ రచయితలకు దొరుకుతుంది. మరి స్వీటీ ఏం చేస్తుందో?!
