హిందూపురం వైసీపీ ఇంచార్జ్ వేణురెడ్డి కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహం చెందిన టీడీపీ కార్యకర్తలు ఈ దాడి చేశారు. ఎవడో హైదరాబాద్ లో ఉండే వాడి కాళ్ల కింద బతుకుతున్నాం.. వాడికి ఓట్లు వేస్తాం, వాడు కూర్చుంటాడు. మనం ఇక్కడ బానిస బతుకులు బతుకుతున్నాం… అని ఆయన వ్యాఖ్యానించారు. వేణురెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయంపై దాడి చేశారు.
ఆయన భార్య దీపికారెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. పేరు దీపికారెడ్డిదే అయినా బెంగళూరులో వ్యాపారం చేసుకునే వేణురెడ్డినే రాజకీయాలు చేస్తారు. ఆయన కూడా ఎక్కువ కాలం ఉండడు.కానీ వివాదాలు సృష్టించాలన్నలక్ష్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ మూడు రోజుల పర్యటనకు వచ్చిన సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతోనే తీవ్ర దుమారం రేగింది. తమ కార్యాలయంపై దాడి చేశారని వైఎస్ జగన్ కూడా ఇంగ్లిష్ లో పోస్టు చేశారు.
ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు తమపై దాడులు చేసేలా.. రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తారని తెలిసిన తర్వాత దాడులు చేశారని గగ్గోలు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం..దాడులు చేశారని గగ్గోలు పెట్టడానికే రాజకీయం చేస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
