గీతా ఆర్ట్స్ సంస్థ ప్రస్తుతం మహాభారతం పై దృష్టి పెట్టింది. మహాభారత గాథని చాలా పెద్ద స్కేల్ లో చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకోసం కొంతమంది రచయితలతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌కి ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అవ్వబోతోంది. మహాభారతం పై వచ్చిన పుస్తకాలు, సినిమాలు, అందులో చర్చించిన విషయాలు ఇవన్నీ రీసెర్క్ చేయడానికి ఓ టీమ్ పని చేస్తోంది. అందుకోసం గీతా ఆర్ట్స్ బాగానే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మహాభారతం గాథపై చాలా సినిమాలొచ్చాయి. అయితే ఈసారి మహాభారతాన్ని ‘అర్జునుడి’ కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అర్జునుడిగా అల్లు అర్జున్ కనిపించే అవకాశం ఉంది. ఆ పాత్రని హైలెట్ చేస్తూ.. సినిమా చేయొచ్చు. అల్లు అర్జున్ తో పాటుగా పాన్ ఇండియా లోని ప్రధానమైన స్టార్లు ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ వుంది.
అయితే మహాభారతం ప్రాజెక్ట్‌పై రాజమౌళి ఎప్పటి నుంచో ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. 5 భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలన్నది ప్లాన్. అందుకోసం ఏళ్ల తరబడి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సివుంది. గీతా ఆర్ట్స్ ఇదంతా రాజమౌళి కోసం చేస్తోందా, లేదంటే రాజమౌళితో పోటీగా మహాభారతం నిర్మించే ఆలోచనలో ఉందా? అనేది ఆసక్తి కలిగిస్తోంది. మగధీర తరవాత రాజమౌళి గీతా ఆర్ట్స్ లో సినిమా చేయలేదు. ఆ ప్రాజెక్ట్ సమయంలో అల్లు అరవింద్ – రాజమౌళి మధ్య క్రియేటీవ్ డిఫరెన్సెన్స్ వచ్చాయని చెప్పుకొన్నారు. అవన్నీ ఇప్పటికి సమసిపోయి ఉంటాయి. రాజమౌళితో మరో ప్రాజెక్ట్ చేయాలని, అందులో బన్నీని భాగం చేయాలని అల్లు అరవింద్ ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. అది మహాభారతం తో తీరే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్, చరణ్, మహేష్, ప్రభాస్, రవితేజ ఇలా స్టార్లందరితోనూ పని చేసిన రాజమౌళి.. బన్నీతో మాత్రం సినిమా చేయలేదు. కాబట్టి గీతా ఆర్ట్స్ లో చేయబోయే మహాభారతానికి రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు కొట్టిపారేయలేం. ఒకవేళ రాజమౌళి ఆలోచనలు వేరుగా ఉంటే, గీతా ఆర్ట్స్ మరో దర్శకుడ్ని చూసుకోవాలి. రాజమౌళిలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి, పాన్ ఇండియా పరంగా క్రేజ్ తీసుకురాగలిగే దర్శకుడ్ని వెదికి పట్టుకోవడం గీతా ఆర్ట్స్‌కి ఓ సవాలే.
