“The Legislatures are the heart of the nation. If the heart stops, the nation dies.”
“చట్టసభలు దేశానికి హృదయం లాంటివి. ఈ హృదయం ఆగిపోతే దేశం చచ్చిపోతుంది.” అని రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేడ్కర్ 1948లో రాజ్యాంగసభలో ఎంతో భావోద్వేగంతో చెప్పారు. ఆయన మాటల్లో ఇసుమంత కూడా అతిశయోక్తి లేదు. దేశం ప్రజాస్వామ్య పునాదుల మీద నిలబడింది. ఆ పునాదులు పార్లమెంటరీ వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. ఏ మాత్రం పార్లమెంటరీ వ్యవస్థ బలహీనపడినా దేశానికే ప్రమాదం ఏర్పడుంది. ఆ రోజుల్లో ఈ స్ఫూర్తిని అర్థం చేసుకున్నారు కాబట్టి పార్లమెంట్ లో కానీ.. రాష్ట్రాల అసెంబ్లీల్లో కానీ చర్చలు ఎంతో అర్థవంతంగా సాగేవి. ప్రత్యక్ష ప్రసారాలు లేకపోయినా .. ప్రజా ప్రతినిధులు తమ ప్రజల పట్ల బాధ్యతతో ఉండేవారు. గెలిచిన వారికే కాదు.. ప్రతి పక్షంలో ఉన్నవారికి.. ప్రజా ప్రతినిధిగా ఉన్న ప్రతి ఒక్కరూ బయట ఎలా ఉన్నా.. పార్లమెంట్ చర్చల విషయంలో నిజాయితీగా ఉండేవారు. తమకు వచ్చిన హోదా.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ద్వారా వచ్చిందని తెలుసు కాబట్టి. కానీ ఇప్పటి రాజకీయ నేతలకు ఆ స్పృహ లేదు. చర్చలతో పనేముందని.. అసలు పార్లమెంట్ ఉన్నది రాజకీయ డ్రామాలు ఆడటానికి అన్నట్లుగా మారిపోయింది. ఎప్పటికప్పుడు ఈ సెషన్‌కు అయినా మంచి చర్చలు జరుగుతాయని.. దేశ సమస్యలపై చర్చలు జరుగుతాయని ప్రజలు ఆశపడతారు కానీ.. ఎప్పటికప్పుడు వమ్ము అయిపోతోంది.
ఇప్పుడంతా భౌ..భౌ !
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. చర్చిద్దామని కేంద్రం అంటున్నా.. అసలు వివాదం దారి మళ్లింది. పార్లమెంట్ సమావేశాల తొలి రోజు తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన రేణుకాచౌదరి వీధి కుక్కను పార్లమెంట్‌కు తీసుకు వచ్చారు. ఆ అంశంపై వివాదం రేగితే… అది కరవదని పార్లమెంట్ లోపల ఉన్న వారే కరుస్తారన్నారు. ఈ వివాదానికి కొనసాగింపుగా రాహుల్ గాంధీ.. పెంపుడు జంతువులకు పార్లమెంట్ లోపలకు మాత్రమే అనుమతి ఉంటుందని వ్యాఖ్యానించారు. అంటే రేణుకా చౌదరి ఎంపీలను కక్కులతో పోల్చారు.. రాహుల్ గాంధీ పెంపుడు జంతువులతో పోల్చారు. వారు కూడా ఎంపీలే. వారు చెప్పిన జాబితాలో వారు కూడా ఉంటారు. అయినా సరే ఆశువుగా అనేశారు. ఈ మాటలు అసలు దేశ సమస్యలను పక్కకు పెట్టేశాయి. విపక్ష పార్టీలో ఉన్న వారే ఇలాంటి వివాదాలు తీసుకు వస్తే.. ఇక అధికార పార్టీ ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకుంటుంది. ప్రజాసమస్యలపై చర్చించుకండా… కుక్కలపై దృష్టిపెట్టారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గత పదేళ్ల చట్టసభల పనితీరును.. ముఖ్యంగా లోక్ సభ, రాజ్యాసభలను పరిశీలిస్తే.. చర్చలు జరిగిన సందర్భమే లేదు. అత్యంత కీలకమైన బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందాయి.
చర్చల్లేకుండా బిల్లులు పాస్
పార్లమెంట్ ఎంత బాగా జరిగితే ప్రజలకు అంత మేలు జరుగుతుంది. కానీ లెజిస్లేటివ్ రిసెర్చ్ డేటా ప్రకారం రాను రాను చట్టసభల పనితీరు క్షీణిస్తోంది. 17వ లోక్‌సభ 2019-2024 కాలంలో సగటు ప్రొడక్టివిటీ కేవలం 47 శాతం మాత్రమే. అంతకు ముందు 16వ లోక్‌సభ 2014-2019 లో 60-70 శాతం ఉంది. ప్రస్తుతం 18వ లోక్‌సభలో కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. ప్రతి సంవత్సరం సగటున 70 రోజులకు పైగా సెషన్లు జరగాల్సి ఉండగా, గత దశాబ్దంలో చాలా సెషన్లు 50-55 రోజులకే పరిమితమయ్యాయి. ప్రతి సారి ఏదో అంశం మీద విపక్షాల నిరసనలు, రాజకీయ ఉద్రిక్తతలు, స్లోగన్లు, ప్లకార్డులతో నిండిన గందరగోళం ఏర్పడుతోంది. 17వ లోక్‌సభలో మొత్తం 387 గంటలు ఇలాంటి ఆందోళనల వల్ల వృధా అయ్యాయని అధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. 2023 వర్షాకాల సమావేశాలు పూర్తిగా వాయిదాలతోనే గడిచిపోయింది. ఇటీవలి సెషన్లలో రోజూ ప్రొటెస్టులు, సస్పెన్షన్లు, వాయిదాలతో సాగుతున్నాయి. చర్చలు లేకుండానే బిల్లులు పాస్ కావడం అత్యంత ఆందోళన కరమైన అంశం. గత 11 ఏళ్లలో పాసైన సుమారు 325 బిల్లుల్లో 47 శాతం బిల్లులు ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. 2020లో వ్యవసాయచట్టాలు చర్చ లేకుండా ఆమోదం పొందాయి. కానీ తర్వాత ఏం జరిగిందో అందరూ చూశారు. చర్చ జరగకపోవడం వల్ల ఆ చట్టాలపై ప్రజలే స్వచ్చందంగా తిరుగుబాటు చేశారు. చివరికి కేంద్రం బిల్లుల్ని ఉపసంహరించుకుంది. ఇలాంటి బిల్లులు.. నిమిషాల వ్యవధిలో పాస్ అవుతున్నాయి. ఫైనాన్స్ బిల్లులు కూడా గిలెటీన్ పద్ధతిలో ఆమోదం పొందుతున్నాయి. దీంతో చట్టాల నాణ్యత, ప్రజాభిప్రాయం ప్రశ్నార్థకమవుతున్నాయి. స్టాండింగ్ కమిటీలకు బిల్లులు పంపే సంప్రదాయం దాదాపు అంతరించిపోయింది. 16వ లోక్‌సభలో 27 శాతం బిల్లులు కమిటీలకు వెళ్లగా, 17వ లోక్‌సభలో ఇది 12 శాతానికి పడిపోయింది. దీంతో నిపుణుల అభిప్రాయాలు, స్టేక్హోల్డర్ల సలహాలు లేకుండానే చర్చలుగా మారుతున్నాయి. పార్లమెంట్ లో చర్చలు జరగడం లేదన్న ధీమాతో ప్రభుత్వాలు మరింతగా బరి తెగిస్తున్నాయి. ఆర్డినెన్స్ రాజ్ తీసుకువస్తున్నాయి. 2014-2023 మధ్య 76 ఆర్డినెన్స్‌లు జారీ అయ్యాయి. పార్లమెంట్‌ను బైపాస్ చేసి చట్టాలు తెచ్చే ఈ పద్ధతి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పార్లమెంట్ ను సజావుగా జరగనిస్తేనే ప్రజలు ఎవరు ఏమిటో తెలుసుకుంటారు. కానీ విపక్షాలు కూడా.. తాము పట్టిందే పట్టు అని .. అప్పటికప్పుడు తమ డిమాండ్ ప్రకారం చర్చించాల్సిందేనని ఆందోళనలకు దిగుతున్నారు. ఫలితంగా 2015-2022 మధ్య 139 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. 2023లో ఒక్క సెషన్లోనే 146 మంది ఎంపీలు సస్పెండ్ అయిన ఘటన భారత ప్రజాస్వామ్యంలో పడిపోతున్న విలువలకు నిలువెత్తు సాక్ష్యంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో మరీ ఘోరం !
తెలుగు రాష్ట్రాల్లో చట్టసభల పనితీరు మరీ ..మరీ ఘోరం. పార్లమెంట్ సెషన్స్.. ఆందోళనలు, వాయిదాలతో ఉంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో పదేళ్ల పాటు చర్చలు కాదు.. కొన్నాళ్లు అరాచకం రాజ్యమేలింది. ఏపీలో 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఉన్నారు. ఆయన సభలకు వస్తే.. తనకు మాట్లాడినంత సేపు అవకాశం ఇస్తే వినియోగించుకుని తాను చెప్పాలనుకున్నది చెప్పి.. రచ్చ చేసి వెళ్లిపోయేవారు. ప్రభుత్వ సమాధానం వరకూ ఆగరు. విపక్షంలో ఉన్నప్పుడే అప్పటి ఎమ్మెల్యే అనితను రోజా.. అత్యంత ఘోరంగా సాటి మహిళా ప్రజా ప్రతినిధిని అవమానించని కూడని విధంగా మాట్లాడారు. స్పీకర్ కోడెలనూ వదిలి పెట్టలేదు. చర్చల్లో పాలు పంచుకున్న పాపాన లేదు. ఆ తర్వాత జగన్ పాదయాత్రకు వెళ్లడానికి అసలు ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్లకుండా బహిష్కరించారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక.. టీడీపీకి ఉన్నది 23 మంది సభ్యులే అయినా.. ఆ ప్రతిపక్షంతో సమగ్రమైన చర్చలు జరపడానికి సీఎం జగన్ నేతృత్వంలోని అధికార పార్టీ సిద్ధపడలేదు. స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం..తాను మొదట వైసీపీ కార్యకర్తను అని ప్రకటించుకుని కనీస విలువల్లేకుండా సభను నడిపారు. రౌడీయిజం.. గూండాయిజం , బూతులు సభలో కామన్ అయిపోయింది. విపక్ష సభ్యుల కుటుంబాలపై దారుణమైన వ్యాఖ్యలు చేయడం పరాకాష్టకు చేరింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలోనే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చట్టసభలకు బ్లాక్ డేస్. ప్రజలు వారిని పాతాళంలోకి తొక్కేసి ఇక ప్రతిపక్షానికి కూడా పనికి రారని తేల్చారు. అయితే జగన్ .. ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను.. గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను పోనివ్వను అని జగన్ రెడ్డి కూర్చున్నారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ విలువ తెలిస్తే ఆయన ఇలా చేయరు. ఆయనకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఫలితంగా ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో అధికార పక్షమే ఉంటోంది. ఇలాంటి పరిస్థితిని ప్రజలు అసలు కోరుకోరు.
తెలంగాణనూ భారత రాష్ట్రసమితి అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చట్టసభలకు విలువలు లేకుండా పోయాయి. విపక్షాలు, ప్రశ్నించే వాళ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ ఫిరాయింపులను చాలా పెద్ద స్థాయిలో ప్రోత్సహించారు. ఫలితంగా శాసనసభాపక్షాలే లేకుండా పోయాయి. అన్నీ బీఆర్ఎస్ లో విలీనమయ్యాయి. మిగిలిన కొంత మందిని సస్పెండ్ చేసేసి బిల్లులు పాస్ చేయించుకునేవారు. ఎవరైనా అడ్డం పడతారు అని అనుకుంటే.. అనర్హతా వేటు కూడా వేసేవాళ్లు. కోమటిరెడ్డితో పాటు సంపత్ కుమార్ పైనా.. అనర్హతా వేటు వేశారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత పద్దతిగా.. ప్రజాస్వామ్య విలువలతో సభను గడిపేందుకు ప్రయత్నిస్తోంది. చర్చలను నిర్వహిస్తోంది. బలప్రయోగం చేసి.. సస్పెన్షన్ల ద్వారా నోరు మూయించాలని అనుకోవడం లేదు. అదే సమయంలో ప్రతిపక్షంగా ఉన్నా బీఆర్ఎస్.. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభను ఉపయోగించుకుంటోంది. ఆందోళనలతో …సమయాన్ని వృధా చేసుకోవడం లేదు. గుడ్డిలో మెల్లగా ఇదే కాస్త మంచి పరిణామం.
ప్రజాప్రతినిధులు మారాలి.. ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలి !
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఎంత బాగా పనితీరు ఉంటే దేశ భవిష్యత్తు అంత బాగా ఉంటుంది. గత దశాబ్దాల కాలంలో కేంద్ర, రాష్ట్రాల్లో చట్టసభల పనితీరు నాసిరకంగా మారింది. పార్లమెంట్ అకౌంటబిలిటీ మెరుగుపరచడం ద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుంది. పార్లమెంట్ గౌరవం, ప్రజాస్వామ్య విలువలు దెబ్బతినకుండా ఉండాలంటే రాజకీయ పార్టీలన్నీ వెంటనే తమ విధివిధానాలను సమీక్షించుకోవాలి. ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రజాస్వామ్యం అసంపూర్ణంగా ఉంటుంది. అసలు ఎంపీలే చర్చలు చేయడం లేదు.. ఇక ప్రజలకు ఎక్కడ భాగస్వామ్యం కల్పిస్తారు. రాజకీయం చేయడం అంటే చట్ట సభల ద్వారానే అనే విషయాన్ని.. ప్రజలకు ఉపయోగపడే చట్టాల ద్వారానే అనే అంశాన్ని నిరంతరం గుర్తు చేసుకోవాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మెరుగుపరచడానికి సంస్థాగత, రాజకీయ, సామాజిక సంస్కరణలు అవసరం. ఇవి అమలు చేస్తే, పార్లమెంట్ ప్రొడక్టివిటీ పెరిగి, ప్రజల ఆకాంక్షలు మరింతగా ప్రతిబింబిస్తాయి. అయితే, రాజకీయ పక్షాల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. ఇండియా లాంటి దేశంలో ఇవి అమలు చేస్తే, ప్రపంచంలో మోడల్ డెమాక్రసీగా మారుతుంది. అందు కోసం ముందుగా చేయాల్సింది సంస్కరణలు కాదు.. పార్టీల ఆలోచనల్లో మార్పు రావడం. పార్లమెంట్ ప్రొడక్టివిటీ కేవలం రికార్డుల కోసం కాదు.. అది భారత ప్రజాస్వామ్య ఆరోగ్యానికి చిహ్నంలాంటిది. దీన్ని మెరుగుపరచకపోతే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గౌరవం ప్రమాదంలో పడుతుంది. అలా జరుగుతోందంటే దానికి కారణం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులే. కూర్చున్న కొమ్మను ఇరుక్కున్న చందంగా.. ప్రజాస్వామ్య దేవాలయానికి సభ్యులుగా ఉండి.. ఆ దేవాలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. అందుకే.. మారాలి.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి.
