ఈటల రాజేందర్ తాను పార్టీ మారడం లేదని చాలా పెద్ద ప్రకటన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదే సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడానికి ఈ ప్రకటన చేశారు. అసలు ఇలా తన పార్టీ మార్పుపై ప్రచారం జరగడానికి కారణం కూడా రాజేందరే. ఆయనే ఇలాంటి పుకార్లకు బలం చేకూర్చే ప్రకటనలు తరచూ చేస్తున్నారు. ఇదే సందనుకుని ఆయన వ్యతిరేకులు కొంత మంది పార్టీ మారుతున్నారని ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీల వ్యూహాల్లో సోషల్ మీడియా ప్రచారం కూడా ఓ భాగమైపోయింది.
పదే పదే శీలపరీక్ష చేస్తున్నారని ఆయన బాధపడుతున్నారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఈ ట్వీట్ పెట్టడానికి ఒక్క రోజు ముందు ఆయన ఆత్మగౌరం, పదవులకు రాజీనామాపై మాట్లాడారు. కోరిన పదవులు దక్కపోయినా బాధపడబోమని కానీ ఆత్మగౌరవం లేకపోతే కచ్చితంగా కొట్లాడాతామని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచల్లాగా వదిలేశామని గుర్తు చేశారు. 20 ఏళ్లలో ఎవరైనా నాలుగుసార్లు ఎమ్మెల్యే అవుతారని కానీ తాను మాత్రం 7 సార్లు ఎమ్మెల్యే అయ్యానని రాజీనామాల విషయాన్ని ప్రస్తావించారు.
సందర్భం లేకుండా చేసిన ఈ వ్యాఖ్యలతో ఈటల బీజేపీ పెద్దలపైనే అసంతృప్తి వ్యక్తం చేశారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇటీవల బీజేపీలో ఈటల పేరు పెద్దగా వినిపించడం లేదు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్‌తో సమావేశం అయ్యేందుకు ఆయనకు అవకాశం కల్పించలేదని చెబుతున్నారు. రామచంద్రరావు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయనతో ఆటలకు సరిపడటం లేదు. సహజంగానే ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు.అసహనంతో ఇలా మాట్లాడే మాటలు బీజేపీకి రాజీనామా వార్తల దిశగా నడిపిస్తున్నాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే రాజేందరే సంయమనం పాటించాల్సి ఉంది.
