తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు పెద్ద చిక్కు వచ్చి పడింది. గతంలో చాలా అసెంబ్లీల్లో స్పీకర్లకు రాని సమస్య ఆయనకు వచ్చింది. పార్టీ ఫిరాయింపులు అన్ని సందర్భాల్లో ఉన్నాయి. ఎప్పుడైనా అనర్హతా పిటిషన్లపై స్పీకర్ దే తుది నిర్ణయం. చట్టం ప్రకారం టైమ్ ఫ్రేమ్ లేదు. అందుకే చివరి అసెంబ్లీ సెషన్లో నిర్ణయం ప్రకటించేవారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కొత్త ఏడాది ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించడం ద్వారా స్పీకర్ ను టెన్షన్ పెట్టింది. కానీ ఆ కామెంట్లు ఉత్తర్వుల్లో ఉండవు. కోర్టు ధిక్కరణపై వివరణ ఇవ్వడానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. కానీ వచ్చే విచారణకు బెంచ్ మారిపోతుంది. ఎందుకంటే సీజేఐ గవాయ్ పదవీ కాలం పూర్తయిపోతోంది.
కొత్త సీజేఐ దృక్కోణం ఎలా ఉంటుందో ?
ప్రస్తుత చీఫ్ జస్టిస్ గవాయ్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కేంద్రం మార్పులు చేయాలని .. టైం ఫ్రేం పెట్టాలని సిఫారసు చేస్తూనే తాను స్పీకర్ కు గడువు విధించారు. మీరు తీసుకుంటారా.. మేము నిర్ణయం తీసుకోవాలా అని ఘాటుగా హెచ్చరించారు. ఈ విషయంలో చీఫ్ జస్టిస్ చాలా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. చట్టం ప్రకారం స్పీకర్ తన అధికారాల్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదని తెలుసు. అయినా ఆయన కోర్టుకు ఎదురెళ్లకుండా చెప్పినట్లు చేయాలనుకున్నారు. విచారణ చేస్తున్నారు. కానీ మరింత సమయం అడిగారు. తాను ఇచ్చిన సమయంలోగా నిర్ణయం తీసుకోనందుకు పైర్ అయ్యారు. కానీ ఈ సారి విచారణకు ఆయన రిటైరవుతున్నారు. కొత్త చీఫ్ జస్టిస్ .. చట్టంలోని సున్నితమైన అంశాన్ని అర్థం చేసుకుని.. .స్పీకర్ పవర్ ను గుర్తిస్తే.. నిర్ణయం గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల్లోకి వస్తుంది.
ఫిరాయింపుల చట్టం ప్రకారం కోర్టు అనర్హతా వేటు వేయలేదు!
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో చాలా స్పష్టంగా..స్పీకర్ దే తుది నిర్ణయం అని ఉంటుంది. ఈ చట్టం ప్రకారం కోర్టులు స్పీకర్ అధికారాన్ని తీసుకుని అనర్హతా వేటు వేయలేవు. కానీ ఇతర అంశాల్లో వేయడానికి అవకాశం ఉంది. ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చెప్పారని గతంలో కొంత మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం ప్రకారం ఓటు వేయలేరు. కోల్ కతా హైకోర్టు ఓ బీజేపీ ఎమ్మెల్యేపై ఇచ్చిన తీర్పు కూడా నిలబడే అవకాశం లేదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అప్పటికే స్పీకర్ నిర్ణయం తీసేసుకున్నారు. స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది.
ఎమ్మెల్యేలకు ఇదే భరోసా – రేవంత్ వద్ద ప్లాన్ బీ ఉందా?
ఇప్పటి వరకూ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న ఈ లోపమే.. ఎమ్మెల్యేలకు ధైర్యం ఇస్తోంది. సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ అంత దూకుడుగా ఉండరని అనుకుంటున్నారు. ఒక వేళ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ప్లాన్ బీ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ఉపఎన్నికలు అనేది మంచి కాన్సెప్ట్ కాదు. అవసరం అయితే ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకుని విలీన ప్రక్రియను అయినా పూర్తి చేస్తారని అనుకుంటున్నారు. పది మందిలో ఎనిమిది మంది ముందు జాగ్రత్తగా పార్టీ మారలేదని వాదిస్తున్నా.. దానం, కడియం మాత్రం ససేమిరా అంటున్నారు. అందుకే ఉపఎన్నికలు రాకుండా.. రేవంత్ రెడ్డినే ప్లాన్ బీ రెడీ చేస్తారని వారు నమ్మకంతో ఉన్నారు.
