పండగ సీజన్ మహిమ ఏమిటో మరోసారి తెలిసొచ్చింది. అక్టోబరు 2.. దసరా పండగ రోజు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ దాదాపుగా హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. ‘కాంతార చాప్టర్ 1’ కు ఊహించినట్టుగానే ఓపెనింగ్స్ అదిరాయి. ప్రీమియర్ల నుంచే ‘కాంతార 2’ హడావుడి మొదలైంది. టాక్ బాగుండడం వల్ల, దసరా పండగ కావడం వల్ల జనాలు ఎగబడ్డారు. గతవారం విడుదలైన పవన్ కల్యాణ్ ‘ఓజీ’ కి కూడా పండగ బాగా కలిసొచ్చింది. గురువారం దాదాపుగా `ఓజీ` థియేటర్లన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి లాంటి ఏరియాల్లో టికెట్లే దొరకలేదు. ‘ఓజీ’ కోసం కొత్తగా ఓ పాట జోడించడం కూడా కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ పాట చూద్దామని రిపీట్ గా వెళ్లిన ప్రేక్షకులూ కనిపిస్తున్నారు. తొలివారం ‘ఓజీ’ని అభిమానులు మోశారు. ఇప్పుడు కుటుంబ ప్రేక్షకులు వరుస కడుతున్నారు. ‘కాంతార’ ఓవర్ ఫ్లోటింగ్ టికెట్లన్నీ ఓజీకే తెగుతున్నాయి.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అక్టోబరు 1న విడుదలై, ఫ్లాప్ టాక్ తెచ్చుకొన్న ధనుష్ సినిమా `ఇడ్లీ కొట్టు` సినిమా ఆడే ధియేటర్లు కూడా అక్కడక్కడ ఫుల్స్ అయ్యాయి. రిలీజ్ రోజున అసలు ఒక్క ధియేటర్ కూడా నిండలేదు. మరుసటి రోజు మాత్రం వసూళ్లు కనిపించాయి. దాన్ని బట్టి దసరా మహిమ ఏమిటో అర్థం చేసుకోవొచ్చు. ‘కాంతార చాప్టర్ 1’ కు శని, ఆదివారాలు కూడా మంచి వసూళ్లే దక్కే అవకాశం ఉంది. ఈ ఊపు ‘ఓజీ’ ఈవారాంతం కూడా నిలుపుకొంటే బ్రేక్ ఈవెన్ కి దగ్గర పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
