వాళ్లు గ్రూప్ 1 మెరిట్ లిస్టులో ఉన్నారు. ఇక ఉద్యోగం వచ్చేసినట్లే అనుకున్నారు. కానీ కోర్టు వారికి షాకిచ్చింది. మెరిట్ లిస్టును రద్దు చేసి మళ్లీ వాల్యూయేషన్ చేయాలని ఆదేశించింది. లేకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఉద్యోగం వచ్చేసిందనుకున్న ర్యాంకర్ల కడుపు కొట్టినట్లయింది. వారి బాధ వర్ణనాతీతం.
ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా సమర్థిస్తున్నారు. తమ పిల్లలు కష్టపడి ర్యాంకులు సాధిస్తే.. డబ్బులు కొట్టి కొనుక్కున్నామని చెప్పడంపై టాపర్ల తల్లిదండ్రులు తెర ముందుకు వచ్చారు. మీడియా సమావేశం పెట్టారు. తాము దిువ కుటుంబాలకు చెందిన వారమని.. పాలప్యాకెట్ల కోసం డబ్బులు వెదుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న వాళ్లమని.. కోట్లు పెట్టి ఉద్యోగాలు కొనే పరిస్థితి లేదన్నారు.
గ్రూప్-1పై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు.. ఒక్కో పేరెంట్ రూ.3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారని ఆరోపణలు చేస్తున్నారు.. మాలో కొందరికి కూటికి కూడా గతి లేదు.. కష్టపడి, పస్తులుండి అప్పులు చేసి పిల్లలను చదివించామన్నారు. అమ్మ, నాన్నల కల నెరవేర్చేందుకు మా పిల్లలు రాత్రింబవళ్ళు కష్టపడి చదివారు. డబ్బులు ఇచ్చి కొన్నవి కాదు.. కుటుంబాలు త్యాగం చేస్తేనే పిల్లలకు ర్యాంకులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరో ఒకరే గెలుస్తారు.. అలా అని ఓడిపోయిన నేతలంతా మళ్లీ ఎన్నికలు పెట్టాలని కోర్టుకు వెళ్తారా?.. అప్పులు చేసి వేల రూపాయల ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లలో చేర్పించాం.. మీ రాజకీయాల కోసం అవాస్తవ ఆరోపణలు చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పు ఎక్కడ జరిగిందో కానీ.. ఎంతో కష్టపడి పరీక్షలు రాసిన ర్యాంకర్లు మాత్రం నష్టపోతున్నారు. ఇలా జరిగితే ఇక ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలపైనే ఎవరికీ నమ్మకం లేకుండా పోతుంది.
