పార్టీ ఫిరాయింపుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని తేల్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదన్నారు. ఆ కండువాలో ఏముందో వారికి తెలియదని.. తమకు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డు చెప్పారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్టమైన విధానాలు లేవని గుర్తు చేశారు.
రేవంత్ స్పందనతో స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందో ముందుగానే అందరికీ ఓ క్లారిటీ వస్తోంది. ఇదే చిట్ చాట్ల్లో రేవంత్ కవిత పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. వారి కుటుంబంలో ఆస్తుల పంచాయతీ నడుస్తోందని.. తనకు సంబంధం లేదన్నారు. కవిత కాంగ్రెస్ లోకి వస్తానంటే మాత్రం తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. అదే సమయంలో కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. కిషన్ రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవని.. ఆయన కేటీఆర్ వద్ద సలహాలు తీసుకుంటారన్నారు. కేటీఆర్ చెప్పినందునే .. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కిషన్ రెడ్డి అడ్డం పడ్డారని.. గతంలో సీబీఐకి ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో విచారణ చేస్తామని సవాల్ చేశారని ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
స్థానిక ఎన్నికలపైనా ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు పెట్టిన గడువుపై సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకూ ఎదురు చూస్తామన్నారు. కోర్టు నిర్ణయించిన గడువులోపు ఎన్నికలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ అంశంపైనా రేవంత్ భిన్నంగా స్పందించారు. వాళ్లు కేసీఆర్ కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారని.. తాము చెప్పినట్లుగా చేయాల్సిందేనని రేవంత్ స్పష్టం చేశారు.
