మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చంద్రబాబు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పంచ సూత్రాలను అమల్లోకి తేవాలనుకుంటున్నారు. 24వ తేదీ నుంచి 29వ ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు పెడతారు. పది వేల మంది అధికారులు పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు.
నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో పంచ సూత్రాలను రైతులకు వివరిస్తారు. రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం దారులు, ఆక్వా, ఉద్యాన, సెరీ కల్చర్ రైతలకూ అవగాహన కల్పిస్తారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వాటిని రైతులకు అర్థమయ్యేలా చెప్పనున్నారు.
శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అవుతుందని.. ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీని వల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పటికే ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌తో పాటు ట్రేసబిలిటీ చేస్తున్నారు. రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రమోట్ చేయాలని నిర్ణయించారు.
రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఉత్పత్తులకు మేలు కలుగుతుంది. రైతుల ఏ పంటలు సాగు చేశారు… వారికి ఎటువంటి సాయం కావాలనేది నేరుగా తెలుసుకోవాలి. సాగులో పురుగుమందుల వినియోగం వల్ల జరిగే నష్టాలను రైతులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలని .. దీంతో పాటు తక్కువ వినియోగం వల్ల కలిగే లాభాలను, సేంద్రీయ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ ఏ స్థాయిలో ఉందనేది వివరించనున్నారు.
17 నెలలుగా రైతులు, వ్యవసాయం కోసం ప్రభుత్వం భారీ సంస్కరణలు అమలు చేసింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద దాదాపు 46.50 లక్షల మందికి పైగా రైతులకు రెండు విడతలుగా రూ.14 వేలు జమ చేశారు. రెండు విడతల్లో కలిపి రూ.6,310 కోట్లు రైతులకు చెల్లించారు. . బిందు సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నారు. పంటలు బాగా పండితే గిట్టుబాటు ధర లేకపోతే రైతులకు నేరుగా ఆర్థిక సాయం చేస్తున్నారు.
