ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించారు. ఓ డీఏ మంజూరు చేశారు. ఇతర ఆర్థికపరమైన డిమాండ్లను పరిష్కరించారు. వెసులుబాటు చూసుకుని పీఆర్సీ ఏర్పాటు చేసి ఐఆర్‌ను ప్రకటిస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో నేరుగా చంద్రబాబు సమావేశం అయ్యారు. వారి కష్టాలు ఆలకించారు. తాను చెప్పాలనుకున్నది చెప్పారు. ఇప్పటికి వారకి సంతృప్తికరమైన ప్రకటనే చేశారు. కానీ వారిని అలా పాంపరింగ్ చేయడం మంచిది కాదని ఎక్కువ మంది టీడీపీ సానుభూతిపరుల కామెంట్. ఎందుకంటే వారికి కృతజ్ఞత ఉండదని అంటారు. జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా వారిని ఆ పద్దతిలో ట్రీట్ చేయాలంటారు.
గతంలో 42 శాతం ఫిట్మెంట్.. ఐదేళ్లకే మళ్లీ 27 శాతం ఐఆర్.. అయినా చంద్రబాబు రాక్షసుడని తిట్లు
ఉద్యోగ సంఘాల నేతలు జగన్ రెడ్డి హయాంలో ఎలా ఉండేవారు ?. ఆయనను పొగడకపోతే జీతం కూడా రాదని కంగారు పడేవారు. అదే విషయాన్ని బహిరంగంగా చెప్పుకున్నారు. ఏమీ ఇవ్వకపోయినా.. ఫిట్ మెంట్ తగ్గించి..దాన్ని డీఏల పేరుతో కవర్ చేసినా… ఆహా ఓహో అని పొగిడేసి వచ్చారు. లేకపోతే సూర్యనారాయణలాగా.. పారిపోయి ఎక్కడో దాక్కోవాల్సి వచ్చేది. తాము అలా పారిపోలేం కాబట్టి పొగిడామని.. ఏపీఎన్జీవో నేతలు పరోక్షంగా చెప్పుకుని .. ఇప్పుడు ఆయన పార్టీలో చేరిపోయి.. ఎప్పుడైనా ఉద్యోగ సమస్యలపై పార్టీ ఆఫీసు నుంచి ప్రెస్ నోట్ వస్తే రిలీజ్ చేస్తూంటారు. సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ఉద్యోగులకు ఎంతో చేశారని చెబుతూంటారు. జగన్ రెడ్డి ఎంతో చేసింది ఉద్యోగులకు కాదు.. వారికే.
అసలు రాక్షసత్వం అంటే ఏమిటో చూపించిన జగన్ రెడ్డి
జగన్ రెడ్డి హయాంలో ఉద్యోగ సంఘాల నేతల నిర్వాకం కారణంగా వారి హక్కుల కోసం గట్టిగా పోరాడలేని దుస్థితి వచ్చింది. ఎవరైనా రోడ్డెక్కితే జగన్ రెడ్డి చూపించిన దాని కన్నా డబుల్ చూపించాలన్న డిమాండ్లు వినిపిస్తూ ఉంటాయి. కానీ చంద్రబాబు అలా అనుకోరు. వెసులుబాటును బట్టి వారికి మేలు చేయాలని అనుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రం అయింది. అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటు కోసం.. ఉద్యోగులు సకలజనుల సమ్మె చేశారు. అందుకే కేసీఆర్ అంత ఇచ్చారు. వారితో పోలిస్తే వెనుకబడకూడదని .. చంద్రబాబు కూడా కష్టమైన 42శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లే ముందు 27 శాతం ఐఆర్ ఇచ్చారు. కానీ రెండు చేతులతో జగన్ కు ఓటేశామని గొప్పగా ప్రకటించుకున్నారు. ఇలాంటి వారికి మేలు చేయాలని ఎవరికైనా అనిపిస్తుందా ?
ఇప్పుడు మళ్లీ ఉద్యోగులకు చంద్రబాబు గౌరవం.. అవసరం ఉందా అనే కామెంట్స్
ఉద్యోగులు జగన్ రెడ్డి హయాంలో ఎంతగా ఇబ్బందులు పడినా.. ఒకటో తేదీకి జీతాలు రాకపోయినాసరే.. వారి ఓటింగ్ తీరులో పెద్దగా మార్పు రాదని.. పోస్టల్ ఓటింగ్ ట్రెండ్స్ లో తేలింది. వైసీపీకి బలంగానే ఓట్లు పడ్డాయి. సామాన్య జనాలు మాత్రమే.. వైసీపీ పాలనను భరించలేమని గట్టిగా ఓట్లేశారు. ఉద్యోగులు మారరు. వారికి ఇచ్చే జీతభత్యాలకు తగ్గట్లుగా ప్రజల కోసం పనులు చేసేందుకు పరుగులు పెట్టించాల్సిన అవసరం కనిపిస్తోంది. అప్పుడే వారికిచ్చే ప్రజాధనానికి న్యాయం చేసినట్లు.
