నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో ముందస్తు దివాళీ సెలబ్రేషన్స్ జరిగాయి. శనివారం రాత్రి హైదరాబాద్ లోని తన ఇంట్లో బండ్ల గణేష్ సినీ ఇండస్ట్రీకి గట్టి పార్టీ ఇచ్చాడు. ఈ విందుకు మెగాస్టార్ చిరంజీవి కదిలి వచ్చారంటే.. బండ్ల రేంజ్ అర్థం చేసుకోవొచ్చు. ఒకరకంగా ఈమధ్యకాలంలో ఏ నిర్మాతా చేయలేనంత గ్రాండ్ పార్టీ ఇది. వెంకటేష్, సిద్దు జొన్నలగడ్డ, తేజా సజ్జా ఇలా చాలామంది హీరోలు ఈ పార్టీలో కనిపించారు. నిర్మాతలు, దర్శకులు, మిగిలిన నటీనటులకు లెక్కే లేదు. దాదాపు 60 మంది సెలబ్రెటీలు ఈ సెలబ్రేషన్స్ లో కనిపించారు. పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. పొద్దుపోయే వరకూ హుషారుగా గడిపారు.
బండ్ల లైమ్ లైట్ లో లేని ప్రొడ్యూసర్. ఈమధ్య సినిమాలేం చేయడం లేదు. నటనకూ దూరంగానే ఉన్నాడు. అయినా సరే.. బండ్ల పార్టీకి పిలిస్తే, పిలిచినవాళ్లంతా వచ్చారు. దానికి కారణం.. బండ్లతో ఉన్న అనుబంధమే. గణేష్ ఇది వరకూ కూడా ఇలాంటి పార్టీలు ఇచ్చాడు. కానీ అన్నీ గప్ చుప్ గా జరిగాయి. ఈసారి మాత్రం అందరికీ తెలిసేలా పార్టీ ఇచ్చాడు. దానికి కూడా కారణం వుంది. త్వరలో బండ్ల యాక్టీవ్ గా మారబోతున్నాడు. వరుసగా సినిమాలు చేసే ప్లాన్ వుంది. అందుకు తగిన ప్రణాళిక కూడా రచించాడు. త్వరలో బండ్ల కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన రాబోతోంది. దానికి ఇది ప్రిపరేషన్ అన్నమాట. బండ్ల ఏం చేసినా.. దాని వెనుక ఓ మతలబు ఉంటుంది. ఈసారి.. `నేను వస్తున్నా.. మళ్లీ సినిమాలు తీస్తా` అనే సిగ్నల్ ఈ పార్టీ ద్వారా పంపాడు. పార్టీలో కూడా తాను చేయబోతున్న సినిమాల గురించి… వచ్చిన అతిథులకు పూస గుచ్చినట్టు చెప్పాడట. అవన్నీ క్రేజీ కాంబినేషన్లతో రాబోతున్నాయని తెలుస్తోంది. పెద్ద పార్టీ ఇచ్చాడంటే.. బండ్ల కచ్చితంగా పెద్ద సినిమా చేయబోతున్నాడనే అర్థం. మరి ఆ సినిమా ఎవరితో అన్నది చూడాలి.
