వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ జరినప్పుడు హంతకులు సీబీఐ ఎస్పీని బెదిరించడానికి చేసిన ప్రయత్నాల్లో ఒకటి తప్పుడు కేసులు పెట్టడం. నిందితుల్ని విచారణకు పిలిస్తే వారు తమను వేధిస్తున్నారని తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు చేసేవారు. ఇలా అవినాష్ రెడ్డికి లెఫ్ట్ హ్యాండ్ గా పేరు పడిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ ఎస్పీపై కోర్టులో పిటిషన్ వేశాడు. కడప దిగువ కోర్టు ఏ మాత్రం ఆలోచించకుండా కేసులు పెట్టాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వుల మేరకు కేసులు పెట్టారు.
ఇటీవల సుప్రీంకోర్టు ఈ కేసులు స్పష్టమైన అధికార దుర్వినియోగంగా గుర్తించింది. సీబీఐ ఎస్పీతో పాటు వైఎస్ సునీత, ఆమె భర్తపై పెట్టిన కేసులను క్వాష్ చేయడంతో పాటు అలాంటి కేసులు పెట్టిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులకు.. ఇద్దరు పోలీసులు తప్పు చేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం రాజుపాలెంలో పని చేస్తున్న ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, విశ్రాంత ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి అనే ఇద్దరిపై ఈ కేసులు నమోదయ్యాయి. కేసు నమోదు చేయాలని జడ్జి ఇచ్చిన ఆదేశాలను వీరు పాటించారు కానీ.. అంతర్గతంగా చాలా పనులు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది.
వైఎస్ వివేకా కేసు దర్యాప్తు సీబీఐ చేయకుండా..నిజాలు బయటకు రాకుండా.. తాము అనుకున్న విధంగానే దర్యాప్తు నివేదిక ఇవ్వాలన్న రీతిలో పోలీసులు, ప్రభుత్వం ఒత్తిడి చేసింది. ఎస్పీ రాంసింగ్ మాత్రం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తన పని తాను కొనసాగించారు. ఆయన మధ్యలో వైదొలిగినా ఇతర అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే..ఆయన తన తల్లికి అనారోగ్యం పేరుతో హాస్పిటల్ లో దాక్కుని.. ఆస్పత్రి చుట్టూ రౌడీ మూకల్ని కాపలా పెట్టారు. చివరికి అరెస్టు కాకుండా తప్పించుకున్నారు. ఇప్పుడు ఆ పాపాలన్నీ బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
