లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర (89) కన్నుమూశారు. వయుసు రిత్యా వచ్చిన అనారోగ్యంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. ఇండియన్ సినిమా మేటి నటుల్లో ఒకరిగా పేరుపొందారు ధర్మేంద్ర. షోలే సినిమా ఆయన కెరీర్ లో మైలురాయి.
1935 డిసెంబర్ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు ప్రకాశ్ కౌర్, హేమమాలిని. సన్నీ డియోల్, బాబీ డియోల్ తొలి భార్య సంతానం.
దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంతో తెరంగేట్రం చేసిన ధర్మేంద్ర, తన కెరీర్లో “షోలే”, “చుప్కే చుప్కే”, “ధర్మ్ వీర్”, “సీటా ఔర్ గీత”, “యాదోం కి బారాత్” వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అభిమానులు ఆయనకు “హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్” అనే బిరుదు ఇచ్చారు.
కేంద్రప్రభుత్వం 2012లో పద్మభూషణ్ పురస్కారంతో సన్మానించింది. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. రాజస్థాన్లోని బికనీర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
