బీహార్ ఎగ్జిట్ పోల్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గెలుస్తుందని చెప్పలేదు. నిజానికి అక్కడ ఎన్డీఏకు ఈ సారి అవకాశం లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇప్పటికే నితీష్ కుమార్.. కూటములు మార్చి మార్చి తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పదో సారి కూడా ఆయనే అంటే అక్కడి ప్రజలు ఏ మాత్రం ఆసక్తి చూపించే అవకాశం లేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే.. నితీష్ కంటే తేజస్వీకే అక్కడ జనం మొగ్గు చూపుతూ వస్తున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏకు అనుకూలంగా వచ్చాయి.
ఎన్డీఏకు ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి?
బీహార్ లో ఎన్డీఏ మరోసారి ఘన విజయం సాధించడానికి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి అంటే.. గట్టిగా ఫలానా విషయం అని చెప్పలేరు. ఎన్నికలకు ముందు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ, ప్రతి మహిళ ఖాతాలో పదివేలు వేయడం వంటివి చేశారు. కానీ ఎన్నికలకు ముందు అమలు చేసే ఇలాంటి హామీల వల్ల ప్రజల్లో.. ఓటర్లలో మార్పు రాదు సరి కదా.. తమను మోసం చేస్తున్నారని అనుకుంటారు. వాళ్లిచ్చిన ఆ కొద్ది మొత్తానికి మోసపోవాల్సిన అవసరం లేదని అనుకుంటారు. అలా పంచడం ఇంకా మైనస్ అవుతుందని ఇంతకు ముందు కొన్ని రాష్ట్రాల ఫలితాలు నిరూపించాయి.
ఆకర్షణీయమైన మేనిఫెస్టో ఆర్జేడీ, కాంగ్రెస్ సొంతం
ప్రతిపక్ష పార్టీకి ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. తాము వస్తే అమలు చేస్తామని బోలెడన్ని హామీలు ఇవ్వొచ్చు. ప్రజలు కూడా అవకాశం ఇచ్చి చూడాలని అనుకుంటారు. సుదీర్ఘంగా అధికారంలో ఉన్న పార్టీ ఓ వైపు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు వచ్చే ఓటర్లు అత్యధికం ఉంటారు. ప్రతి ఇంటికో ఉద్యోగం, మహిళలకు డబ్బులు సహా చాలా పథకాలను తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఆయన అమలు చేయరని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయనకు ఇప్పటి వరకూ అవకాశం రాలేదు. పైగా యువత తేజస్వీ యాదవ్ వైపు చూస్తున్నారు. ఆయన అయినా తమ బతుకులు మారుస్తారని ఉద్యోగాలు,ఉపాధి అవకాశాలు తెస్తారని అనుకుంటున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ లో ఇవేమీ కనిపించలేదు.
హర్యానాలో అదే పరిస్థితి
హర్యానాలో బీజేపీ ఓడిపోతుందని అందరూ తేల్చారు. ఒకటో..రెండో సర్వేలు మాత్రమే.. బీజేపీకి మళ్లీ చాన్స్ ఉందని అనుకున్నారు. ఫలితాలు ప్రారంభమయ్యాక.. ట్రెండ్స్ కూడా అలాగే వచ్చాయి. కానీ తర్వాత మొత్తం తిరిగిపోయింది. చాలా స్వల్ప ఓట్ల తేడాతో.. చాలా సీట్లను కాంగ్రెస్ కోల్పోయింది. చివరికి కొన్ని వేల ఓట్ల తేడాతో ప్రభుత్వాన్ని బీజేపీ మళ్లీ ఏర్పాటు చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీకి హార్ట్ ఎటాక్ తెచ్చి పెట్టింది. ఓట్ల చోరీకి ఇదే ఆధారంగా చేసుకుని రాహుల్ పోరాడుతున్నారు. ఓట్ల చోరీ జరిగిందని .. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమకు అనుకూలంగా వచ్చినా బీజేపీ గెలిచిందని చెప్పుకొస్తున్నారు.
ఇప్పుడు బీహార్ లోనూ అలాంటి పరిస్థితి ఉండదని అంచనా వేయలేం. కాంగ్రెస్ , ఆర్జేడీ కూటమి ఓడిపోతుందని చచాలా మంది నమ్మలేకపోతున్నారు. అందుకే పధ్నాలుగో తేదీన అద్భుతం జరుగుతుందని ఎక్కువ మంది అనుకుంటున్నారు.
