నక్సల్స్ గ్రూపులకు మద్దతు ఇస్తున్నారని కొంత మంది తెలంగాణ నేతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరికలు జారీచేశారు. ఆయుధ గుంపులకు మద్దతు ఇస్తూ ప్రజాస్వామ్యం పేరుతో మాట్లాడుతున్నవారు తమ సంబంధాలను తెంచుకోవాలని లేకపోతే వారి గురించి మొత్తం బయటకు వస్తుందని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
మావోయిస్టు కేడర్ల వద్దే కాకుండా, అవినీతి, నేరపరమైన కార్యకలాపాలు, తీవ్రవాద సంబంధాలను కాపాడే నెక్సస్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తున్నదని ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశ భద్రత కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఎవరైనా కావొచ్చు, ఎంత పెద్ద నాయకులైనా కావొచ్చు, దేశ భద్రతకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు.
ఆషామాషీగా బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుకోవడానికి లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. నక్సల్ నెట్ వర్క్ ను ఇప్పటికే కేంద్రం చేధించింది. పరిమిత సంఖ్యలోనే నక్సలైట్లు మిగిలారు. అదే సమయంలో మిగిలిపోయిన టాప్ కమాండర్లు కొంత మంది తెలంగాణలోనే తలదాచుకున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కు చెందిన కొంత మంది రాజకీయ నేతలు షెల్టర్ ఇస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో బండి సంజయ్ ఇలాంటి ప్రకటన చేయడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు.
బండి సంజయ్ చేసిన ప్రకటన ఏ విధంగా చూసినా అది రాజకీయ ప్రకటన కాదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఆయనకు ఖచ్చితంగా ఏదో పక్కా సమాచారం రావడంతోనే హెచ్చరికలు జారీ చేస్తూ ఈ ట్వీట్ పెట్టారని అనుమానిస్తున్నారు.
