ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఉన్న బకాయిలకు బదులు స్థలాలు ఇచ్చినా ఓకేనని ఏపీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రకటించారు. తామే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టామని చెబుతున్నారు. జగన్ రెడ్డి హయాంలో పూర్తిగా ఉద్యోగులు మోసపోయానని.. ఒకటో తేదీన జీతం ఇవ్వాలని అడిగినందుకు జైళ్లలో పెట్టారన్నారు. ప్రభుత్వం పాత బకాయిలు వరుసగా తీరుస్తోందని..కానీ కొండలా పేరుకుపోయినందున.. బకాయిలకు బదులు స్థలాలు ఇచ్చినా పర్వాలేదంటున్నారు.
ఉద్యోగులకు జగన్ హయాంలో వేధింపులు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఉద్యోగసంఘం నేతల్లో కొంత మంది వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుని ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టేశారు. చివరికి సీపీఎస్ రద్దు చేశాం అని చెప్పి.. ఇంకా దారుణమైన స్కీమ్ ను ప్రవేశ పెట్టామని చెబితే దానికీ అంగీకరించారు. చివరికి పీఆర్సీ సహా ఏమీ లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులు గతంలో వ్యవహరించిన తీరు వల్ల.. తమ హక్కులను గట్టిగా అడగలేకపోతున్నారు.
ప్రభుత్వమే ఉద్యోగులు అడిగినా అడగకపోయినా డీఏ బకాయులు చెల్లిస్తూ వస్తోంది. పీఆర్సీపై ప్రస్తుతం ఆర్థిక వెసులుబాటు లేనందున ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. గతంలో సూర్యనారాయణ చంద్రబాబును విమర్శించేవారు. కానీ వైసీపీ హయాంలో ఆయన నెలల తరబడి పారిపోవాల్సి వచ్చింది.ఇప్పుడు చంద్రబాబే మేలు చేస్తున్నాడని చెబుతున్నారు.
