కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఓ ఎకో సిస్టమ్ ఏర్పడింది. ఐటీ రంగంతో పాటు ఆటోమోబైల్, ఫార్మా రంగాలు ఉన్నాయి. వాటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా చిన్నది. సరైన రాజధాని లేదు. ఇప్పటికీ ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ ఏర్పాటు కాలేదు. అయినా ఆయా రాష్ట్రాలకు చెందిన కొంత మంది ఏపీని కించ పరిచేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఏపీ దగా పడ్డ రాష్ట్రం. వనరులన్నీ లాగేసుకుని వదిలేసిన రాష్ట్రం. ఇప్పుడు ఆ రాష్ట్రం లేచి నిలబడే ప్రయత్నం చేస్తూంటే.. కుదిరితే చేయి అందించాలి కానీ.. ఈర్ష్యతో కించపర్చకూడదు.
ప్రియాంక్ ఖర్గే చెప్పింది నిజమే.. ఏపీ పారిశ్రామిక రంగం చాలా చిన్నదే !
బెంగళూరులో కష్టంగా ఉందంటున్న పారిశ్రామికవేత్తలకు నారా లోకేష్ ఆహ్వానం పలకడం ప్రియాంక్ ఖర్గేకు నచ్చడం లేదు. అప్పట్లో సెటైర్లు వేశారు. తాజాగా గూగుల్ పెట్టుబడి వస్తే దానికి ఆయన బోలెడన్ని రాయితీలు ఇచ్చారని తక్కువ చేసి చూశారు. తమకు అలా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దానిపై వచ్చిన రియాక్షన్స్ గురించి పక్కన పెడితే ఆయన ఏపీ పట్ల అంత తక్కువ భావంతో ఎందుకు ఉన్నారన్నదే అసలు విషయం. ఏపీకి పరిశ్రమలు లేవు. ఏపీకి పెట్టుబడులతో ఇచ్చేసే ఎకోసిస్టమ్ లేదు. అది ఏర్పాటు కావడానికే ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. దాన్ని ఆయన జీర్ణించుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐటీ సహా అన్ని రంగాల్లో ఎంతో కొంత పెట్టుబడులు సాధించి.. ప్రజలకు ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ ప్రయత్నం.
మూడు దిగ్గజ నగరాల మధ్య ఎదగడం చిన్న విషయం కాదు !
ఏపీ చుట్టూ మూడు మెట్రో నగరాలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. వీటి మధ్య ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఎదుగడం చిన్న విషయం కాదు. ఇప్పటికీ తెలుగు ప్రజలు.. ఆ మూడు నగరాలపై ఆధారపడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు యువత ఉపాధి కోసం వెళ్లిపోతోంది. ఎప్పటికీ ఏపీ ఇలా ఉండాల్సిందేనా ?. సొంత రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను సృష్టించుకునే ప్రయత్నం చేయకూడా తప్పేనా ?. పాలకులను బట్టే విధానాలు ఉంటాయి. పారిశ్రామిక ఎకోసిస్టమ్ ఏర్పాటు అయితే భావితరానికి మేలు జరుగుతుందని ప్రస్తుత పాలకులు ప్రయత్నిస్తున్నారు.
అక్కడ పెట్టాల్సిన పెట్టుబడులు ఏపీకి వస్తే.. తప్పెవరిది ?
నిజానికి ఏపీకి వచ్చే పెట్టుబడులు మూడు నగరాలకు రావాల్సిన పెట్టుబడుల ఓవర్ ఫ్లో అనుకుంటే తప్పేమీ లేదు. నిజమే కావొచ్చు కూడా. అలా జరిగితే తప్పెవరిది ?. తమకు రావాల్సిన పెట్టుబడులు వేరే చోటకు ఎందుకు వెళ్తున్నాయో ఆలోచించుకోరా ?. అక్కడ వారికి తగ్గ సౌకర్యాల కొరత ఏర్పడటమో.. ప్రోత్సాహకాలు బాగున్నాయనో వేరే చోటకు వెళ్తారు. అంత మాత్రాన ఆ పెట్టుబడులు వెళ్తున్న ప్రాంతాన్ని కించ పరచడం మంచిది కాదు. అయినా ఏపీ … చుట్టూ ఉన్న మూడు రాష్ట్రాలతో పోలిస్తే.. ఎక్కడో ఉంది. టార్గెట్ చేస్తే అది ఆయా రాష్ట్రాలకే అవమానం.
