ఏపీ ఉద్యోగ సంఘాలకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. ప్రభుత్వం వారితో వారి సమస్యలపై చర్చించేందుకు సిద్ధమయింది. గత ప్రభుత్వంలో ఉద్యోగసంఘ నాయకుల కారణంగా. ఉద్యోగుల ప్రయోజనాలు పట్టించుకునేవారు లేకుండా పోయారు. పీఆర్సీ, మధ్యంతర భృతి ఏదీ లేకుండా పోయింది. ప్రభుత్వం ఉన్నంత కాలం ఇష్టం వచ్చినట్లుగా తమ సొంత ప్రయోజనాల కోసం.. ప్రభుత్వానికి బాకా ఊదడంతో ఇప్పుడు వారు నోరెత్తే పరిస్థితి లేకుండా పోయింది.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం పెట్టిపోయిన బాకీలు కొన్నింటినీ ఉద్యోగులకు తీర్చింది. ఇంకా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. దీంతో వారితో సమావేశానికి చీఫ్ సెక్రటరీ నిర్ణయించారు. జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీటింగ్ ను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు .. తమ సమస్యలను చెప్పుకోవచ్చు.
ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పీఆర్సీ అడుగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు 43 శాతం ఇంక్రిమెంట్ ఇచ్చారు. తర్వాత ఎన్నికలకు వెళ్లే ముందు 2019లో పీఆర్సీ కమిషన్‌ను నియమించి 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చారు. అంటే పదేళ్ల కాలంలో దాదాపుగా 75 శాతం వారికి జీతం పెంచారు. కానీ ఎన్నికల్లో వారు వైసీపీకి పని చేశారు. వైసీపీ గెలిచిన తర్వాత టీడీపీపై రాజకీయ పోరాటం చేశారు. రెండు చేతులతో ఓట్లేసి జగన్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్నారు.
జగన్ వారికి డీఏలన్నీ ఎగ్గొట్టి.. చంద్రబాబు ఇచ్చిన ఐఆర్‌ను 27 నుంచి 21కి తగ్గించి పీఆర్సీ ఖరారు చేశారు. అంటే.. జీతం పైసా పెరగలేదు. అంతే కాదుఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ తొక్కి పట్టేశారు. అప్పుడు అడిగితే కేసులు పెడతారన్న భయంతో సైలెంటుగా గా ఉండిపోయారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో మళ్లీ మా సమస్యలూ అంటూ బయలుదేరుతున్నారు. కానీ ఈ సారి ఎప్పట్లా ఉద్యోగుల్ని చూసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు.
